Thursday, May 21, 11:10
34.2 C
Hyderabad

State Anthem : రాష్ట్ర గీతానికి అవమానం..విజయ్ ప్రమాణ స్వీకారంపై వివాదం

State Anthem
State Anthem

State Anthem :  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకం మొదలైంది. ఎన్నో ట్విస్టులు, ఉత్కంఠల మధ్య తమిళగ వెట్రి కజగమ్ (TVK) అధినేత విజయ్ మే 10, 2026న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆయన సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సినిమా థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈ రాజకీయ పరిణామాలతో తమిళనాట ఒక్కసారిగా వేడి రాజుకుంది. విజయ్ అధికార పగ్గాలు చేపట్టగానే ఆయనకు మద్దతుగా నిలిచిన మిత్రపక్షాల నుంచే అసంతృప్తి స్వరాలు వినబడటం గమనార్హం.

ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర గీతానికి జరిగినట్లుగా చెప్తున్న అవమానమే. నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర గీతమైన ‘తమిళ్ తాయి వాళ్తు’ ఆలపించడంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారంటూ వామపక్షాలు, వీసీకే (VCK) పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంప్రదాయం ప్రకారం కార్య క్రమం ప్రారంభంలోనే రాష్ట్ర గీతాన్ని పాడాల్సి ఉండగా, దాన్ని చివరన ఆలపించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం విజయ్‌కు ఒక ఘాటైన లేఖ కూడా రాశారు.

సదరు లేఖలో వీరపాండియన్ పేర్కొన్న వివరాల ప్రకారం… ప్రమాణ స్వీకార వేడుకలో ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమన పాడి, చివరగా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయి వాళ్తు’ ఆలపించారు. దశాబ్దాలుగా వస్తున్న ప్రోటోకాల్ ప్రకారం మొదట రాష్ట్ర గీతం, ముగింపులో జాతీయ గీతం ఆలపించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. రాజ్ భవన్ నిబంధనలను, సాంప్రదాయాలను తుంగలో తొక్కి రాష్ట్ర గీతానికి మూడో స్థానం ఇవ్వడం ద్వారా దానికి అవమానం జరిగిందని, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సీఎం విజయ్, ప్రొటెం స్పీకర్ హామీ ఇవ్వాలని కోరారు.

ఈ వివాదంపై కొత్త ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆధవ్ అర్జున తక్షణమే స్పందించారు. రాష్ట్ర గీతాన్ని అవమానించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ‘తమిళ్ తాయి వాళ్తు’ గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడం ప్రోటోకాల్ ప్రకారం సరైంది కాదనే విషయాన్ని ఆయన అంగీకరించారు. ఈ వ్యవహారంలో ఎక్కడ పొరపాటు జరిగిందనే అంశంపై సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరణ కోరుతామని మంత్రి ఆధవ్ అర్జున హామీ ఇచ్చారు.

మరోవైపు విజయ్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ప్రతిపక్షాలు కూడా ఆయనపై విమర్శల దాడిని ముమ్మరం చేశాయి. ప్రతిపక్ష నాయకుడు ఎం.కె. స్టాలిన్ విజయ్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం బాధ్యతలు చేపట్టిన మొదటి ప్రసంగంలోనే రాష్ట్రంలో డబ్బు లేదంటూ నిధుల కొరతను సాకుగా చూపడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయవద్దని స్టాలిన్ హెచ్చరించారు. నేడు (మే 11) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదాల నేపథ్యంలో అసెంబ్లీలో రాష్ట్ర గీతాన్ని మొదటి స్థానంలోనే ఆలపించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.