Thursday, May 21, 11:10
34.2 C
Hyderabad

Nirbhaya : ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన….కదులుతున్న బస్సులో లైంగికదాడి

sexual assault on a moving bus
sexual assault on a moving bus

Delhi Ranibagh Rape Case: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మళ్ళీ ప్రశ్నార్థకమైంది. 2012 నాటి ‘నిర్భయ’ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ, రాణీబాగ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు సోమవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి విహార్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉంది. ఒక ప్రైవేట్ బస్సు అక్కడ ఆగగా, ఆమె ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె బస్సులోకి అడుగు పెట్టగానే డ్రైవర్, కండక్టర్ ఆమెను బలవంతంగా లోపలికి లాగారు.

బస్సును రాణీబాగ్ నుండి నాంగ్లోయ్ వరకు రోడ్లపై తిప్పుతూ, కదులుతున్న బస్సులోనే ఆ కామాంధులు ఆమెపై అమానుషంగా అత్యాచారం చేశారు. రాత్రంతా ఆమెను నరకయాతనకు గురిచేసి, ఆపై నిర్జన ప్రదేశంలో రోడ్డు పక్కన పడవేసి పరారయ్యారు. కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన రాణీబాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనా స్థలంలో, బస్సు ప్రయాణించిన మార్గాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా అనుమానిత బస్సును గుర్తించిన పోలీసులు, కొన్ని గంటల్లోనే బస్సును సీజ్ చేసి డ్రైవర్,  కండక్టరును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆధారాల సేకరణ కోసం బస్సును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితులకు గతంలో ఏవైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

 ఈ ఘటనతో ఢిల్లీలో రాత్రివేళ ప్రయాణించే మహిళల్లో భయం నెలకొంది. ప్రైవేట్ బస్సుల పర్యవేక్షణపై కఠినమైన నిబంధనలు ఉండాలని మహిళా సంఘాలు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.రాజధానిలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం పోలీసులు చార్జ్‌షీట్‌ను పటిష్టం చేసేందుకు కాల్ రికార్డులు, ఇతర సాక్ష్యాలను సేకరిస్తున్నారు.