Thursday, May 21, 11:11
34.2 C
Hyderabad

Bandi Bhagirath POCSO Case : మనోవేదన అనుభవిస్తున్నాం…మమ్మల్ని వేదనకు గురి చేయొద్దు…బండి భగీరథ్‌ కేసులో బాలిక తల్లి

Bandi Sai Bhageerath
Bandi Sai Bhageerath

Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన 4 పేజీల లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తాము ఎటువంటి రాజకీయ పలుకుబడి లేని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని పేర్కొంటూ, ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తరుణంలో తన కుమార్తె ఐడెంటిటీని (గుర్తింపును) బహిర్గతం చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్లలో తన కుమార్తె ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.భరించలేని మనోవేదన అనుభవిస్తున్నామని పేర్కొంటూ ఆమె ఆ లేఖలో వెల్లడించారు.
 
2025లో బండి భగీరథ్‌(Bandi Bhageerath) తన కుమార్తెకు పరిచయమయ్యాడని, మాయమాటలు చెప్పి మభ్యపెట్టాడని లేఖలో పేర్కొన్నారు. వేర్వేరు ప్రదేశాలు, అపార్ట్‌మెంట్స్‌కు తీసుకెళ్లి.. ఆమె ఎంత ప్రతిఘటించినప్పటికీ శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు.”ముఖ్యంగా 2025 డిసెంబరు 31 అర్ధరాత్రి, 2026 జనవరి 1న మొయినాబాద్‌లో నా కుమార్తె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం శారీరకంగా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ సంఘటనలు గుర్తొచ్చిన ప్రతిసారీ నా కుమార్తె కళ్లల్లో తీవ్రమైన భయం, నరకయాతన కనిపించాయి. తల్లిగా ఆమె పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాను” అని లేఖలో వివరించారు.

Also Read :  బండి భగిరథ్ కు షాక్….బెయిల్ నిరాకరించిన హైకోర్ట్

Girl’s Mother In Bandi Bhagirath Case

ఈ ఏడాది జనవరిలో భగీరథ్‌(bandi baghirath abscond) తో సంబంధాలు తెగిపోయాక బాలిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఆ భయం నుంచి కోలుకున్నాక ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో చట్టపరమైన మార్గాలను పరిశీలించామని తల్లి తెలిపారు. అయితే, తామే బ్లాక్‌మెయిల్, ఎక్స్‌టార్షన్‌ (వసూళ్లు)కు పాల్పడుతున్నట్టు ఏప్రిల్ 21న తమ కుటుంబంపైనే ఎదురు ఫిర్యాదు చేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు.ఈ క్రమంలో ఏప్రిల్‌ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మధ్యవర్తిత్వం నెరిపాడని, దాంతో న్యాయం జరుగుతుందనే ఆశతో ఏప్రిల్‌ 23న బండి భగీరథ్‌ తండ్రిని ఆయన నివాసంలో కలిశామని లేఖలో పేర్కొన్నారు. అయితే, రక్షణ దొరుకుతుందని భావిస్తే.. అక్కడ ఎదురైన పరిస్థితులతో తీవ్ర భయంతో వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.బండి భగీరథ్‌పై ఫిర్యాదు ఇచ్చేందుకు పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అధికారులు కావాలనే ఆలస్యం చేశారని బాధితురాలి తల్లి ఆరోపించారు.

మొదట సాధారణ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ‘సిట్’ (SIT) ఏర్పాటు చేసి నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లను చేర్చారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు సకాలంలో పూర్తికాకపోవడం తమను భయపెడుతోందని, నిందితుడు భగీరథ్‌ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడని లేఖలో ఆరోపించారు. “తప్పు చేశానంటూ” భగీరథ్‌ స్వయంగా పంపిన మెసేజ్‌లు, చాట్స్‌ తమ వద్ద ఉన్నాయని.. వాటిని అతడు తొలగించకముందే ఆ డిజిటల్‌ సాక్ష్యాలను భద్రపరిచి ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపాలని డిమాండ్ చేశారు. అలాగే పేట్‌బషీరాబాద్‌ ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్, జనరల్‌ డైరీ ఎంట్రీస్, స్టేషన్ రికార్డులను కూడా భద్రపరచాలన్నారు.

కేసులోని సాంకేతిక ఆధారాలను, తీవ్రతను తారుమారు చేసేందుకే కావాలనే బాలిక వయసును తెరమీదకు తెచ్చి వివాదాలు సృష్టిస్తున్నారని తల్లి మండిపడ్డారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఈ కేసులో స్వతంత్రంగా విచారణ జరపాలని, నిజమైన వాస్తవాలను ఎవరూ తొలగించలేరని ఆమె స్పష్టం చేశారు.

Also Read :  బండి సంజయ్ తల్లికి గుండెపోటు: ఆసుపత్రికి తరలింపు