AI Fighter Jets: రాబోయే రోజుల్లో గగనతలంలో జరిగే యుద్ధాలు ఊహించని విధంగా మారబోతున్నాయి. ఇప్పటిదాకా F-35 లైట్నింగ్, రఫేల్ లాంటి అయిదవ తరం స్టెల్త్ విమానాలను చూశాం. అయితే త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన స్వయంప్రతిపత్తి గల రోబోటిక్ యుద్ధ విమానాలు మానవ పైలట్లను వెనక్కి నెట్టేస్తాయని అమెరికా వైమానిక దళాల వర్గాలు హెచ్చరించడం సంచలనం రేపుతోంది. వేగంగా ప్రయాణించే సూపర్‌సోనిక్ విమానాలకు సూపర్‌కంప్యూటర్లు, ఏఐ అల్గారిథమ్‌లు ఆదేశాలు ఇస్తే, ఈ రోబోటిక్ యుద్ధ విమానాలు కనురెప్పపాటులో నిర్ణయాలు తీసుకుంటాయి. ఇవి భవిష్యత్తులో జరగబోయే అత్యంత సాంకేతిక యుద్ధానికి నాంది పలకనున్నాయి.
NTR Dragon: ‘పాలిపోయిన ముఖంతో.. బక్కచిక్కిపోయి’.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!
అమెరికా వైమానిక దళ లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టోఫర్ నీమి సెనేట్ సాయుధ సేవల కమిటీ ముందు కీలక ప్రకటన చేశారు. పెంటగాన్ ఇప్పుడు సంప్రదాయ రక్షణ వ్యవస్థల కన్నా పూర్తిగా ఏఐ ఆధారిత యుద్ధం, తదుపరి తరం పోరాట వ్యవస్థలపైనే ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు. మానవ పైలట్ నడిపే యుద్ధ విమానం కన్నా రోబోటిక్ యుద్ధ విమానం అనేక రెట్లు మెరుగ్గా పనిచేసే పరిస్థితి అనివార్యంగా వస్తుందని తెలిపారు. ఈ సరికొత్త AI టెక్నాలజీని స్వీకరించేందుకు యూఎస్ గనుక వేగవంతం చేయకపోతే.. ఇది దేశ రక్షణ రంగానికి ఓ పెద్ద వ్యూహాత్మక వైఫల్యం అవుతుందని తేల్చిచెప్పారు.
Also Read: అభినయ్ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్
ఈ సవాలును ఎదుర్కోవడం కోసం అమెరికా వైమానిక దళం ‘కోలాబరేటివ్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (CCA) కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద F–22 రాప్టర్, భవిష్యత్ మానవసహిత విమానాలతో పాటు ఆకాశంలో కలిసి ఎగిరే పాక్షిక-స్వయంప్రతిపత్తి, పూర్తి స్వయంప్రతిపత్తి గల డ్రోన్‌లను డెవలప్ చేస్తున్నారు. ముందుగా ఈ రోబోటిక్ విమానాలు మానవ పైలట్ల పర్యవేక్షణలో పనిచేస్తాయి. కేవలం నిఘా, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలకే పరిమితం అవుతాయి. రాబోయే రోజుల్లో క్రమంగా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. శత్రువులపై ప్రమాదకరమైన క్షిపణి దాడులను కూడా స్వతంత్రంగా నిర్వహించే సామర్థ్యం ఉంటుంది.
F35, రఫేల్ లాంటి విమానాల్లో కూర్చునే మానవ పైలట్లకు భౌతిక పరిమితులు ఉంటాయి. ఆకాశంలో విన్యాసాలు చేసేటప్పుడు పీడనం 9G లేదా 10G దాటితే మానవ పైలట్ స్పృహ కోల్పోయే ముప్పు కూడా ఉంది. కానీ రోబోటిక్ జెట్‌లకు ఈ శారీరక లిమిట్స్ అనేవి ఉండవు. పైగా AI నిర్ణయం తీసుకునే వేగం మానవ మెదడు కన్నా లక్షల రేట్లు వేగంగా ఉంటుంది. ఒక మానవ పైలట్ ముప్పును చూసి స్పందించేలోగా AI వ్యవస్థ ఆ ముప్పును విశ్లేషించి ప్రతీకార మిస్సైల్‌ను ప్రయోగిస్తుంది. అందుకే అత్యుత్తమ ఏఐ యుద్ధ విమానాల సైన్యాన్ని కలిగి ఉన్న దేశాలు రాబోయే అగ్రరాజ్యాలుగా నిలుస్తాయని జనరల్ నీమి స్పష్టం చేశారు.










