
Nepal : నేపాల్లో సంభవించిన ఈ భీకర ఆకస్మిక వరదలకు గల అసలు కారణాలపై శాస్త్రవేత్తలు, అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా భారీ హిమపాతం ఏర్పడి ఉంటుందని, అదే ఈ విపత్తుకు ప్రధాన కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ వెల్లడించారు.
ఖాట్మండు విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ రీసెర్చర్, ప్రొఫెసర్ రిజన్ భక్త కాయస్థ తెలిపిన వివరాల ప్రకారం.. టిబెట్ వైపు సంభవించిన మంచు చరియల విరిగిపడటం వల్ల లెండే నది తాత్కాలికంగా అడ్డుకోబడింది. దీనివల్ల పెద్ద ఎత్తున నీరు ఒకచోట నిల్వ ఉండి, ఆ తర్వాత ఒక్కసారిగా ఆ ఆనకట్ట కూలిపోవడంతో భారీ నీటి ప్రవాహం భోటేకోషి నదిలోకి పోటెత్తింది. చైనా, నేపాల్ శాస్త్రవేత్తలతో జరిపిన ప్రాథమిక చర్చల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు.
ఈ విపత్తుకు ముందు యూఎస్ జాలాజికల్ సర్వే ప్రకారం.. టిబెట్ భూభాగంలో గోసాయికుండకు ఉత్తరంగా సుమారు 47 కిలోమీటర్ల దూరంలో ఉదయం 8:37 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కేవలం అంతుచిక్కని వేగంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ వరద ప్రవాహం టిబెట్ వైపు నుంచి వచ్చి నేపాల్లోని రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాలను ముంచెత్తింది.
Also Read : నేపాల్లో భీకర వరదలు.. 105 మంది భారతీయులు, 384 మంది టూరిస్టులు మిస్సింగ్!
ఈ ప్రమాదంలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్తున్న 105 మంది భారతీయులతో సహా వందలాది మంది గల్లంతు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రసువాగఢీ చెక్పోస్ట్ వద్ద సుమారు 384 మంది యాత్రికులు (291 మంది విదేశీయులు, 93 మంది నేపాళీలు) బుధవారం సరిహద్దు దాటాల్సి ఉండగా, వారిలో చాలామందితో ఇంకా ఎలాంటి సంబంధాలు ఏర్పడలేదు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరుల సమాచారం. సహాయం కోసం కాట్మండ్లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా ఈ క్రింది అత్యవసర నంబర్లను(+977 985 131 6807, +977 970 910 7500) అందుబాటులోకి తెచ్చింది.
ఈ విపత్తుపై నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా నేషనలిస్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవనాల వర్షాలు ఈ ప్రాంతంలో వరదలకు కారణమవుతుంటాయని, వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి తీవ్రమైన విపత్తులు ఎక్కువవుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తున్నారు.
Also Read : ఇరాన్ వార్.. అమెరికా రైతులకు అంతులేని నష్టం.. అసలేం జరుగుతోంది?









