Union Cabinet : ఇటీవల నెలకొన్న వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మంత్రి వర్గంలో భారీగా ప్రక్షాళన తీసుకురావాలని భావిస్తోంది. ప్రధాని మోదీ శుక్రవారం మోదీ ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ల పర్యటనకు వెళుతున్నారు. ఆయన తిరిగి సెప్టెంబరు 1వ తేదీన వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గంలో మార్పుతో పాటు అధికార యంత్రాంగంలో మార్పులు, గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాబోయే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ పోరును దృష్టిలో పెట్టుకుని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రుల్లో 70 ఏళ్ల వయసు దాటిన 18 మందికిపైగా క్యాబినెట్‌, సహాయమంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే 12 ఖాళీలను భర్తీ చేయడంతో మొత్తం 30 మంది కొత్త మంత్రులను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మిత్రపక్షాల సర్దుబాటు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాల ఆధారంగా మంత్రి వర్గంలో మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 12 ఖాళీలు ఉండటంతో పాటు, పలువురు మంత్రులకు అదనపు శాఖలు భారంగా ఉన్నాయి. దీనిని తగ్గించేందుకు కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.

Also Read : నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఈశ ఫౌండేషన్ బృందం.. 80 మంది గల్లంతు?

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ విషయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఆశలు రేపుతుంది. సెప్టంబరు నెలలో ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు హస్తినలో సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ నేతలకు ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ పార్టీ కమిటీలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడంతో కేంద్ర మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించాలని నాయకత్వం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాగా, మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో స్థానం కోసం ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, గోడెం నగేశ్ పేర్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి. వీరితో పాటు డీకే అరుణ, లక్ష్మణ్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఏపీ నుంచి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి గవర్నర్‌ పదవి లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి పార్టీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇస్తారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఇక్కడ మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఒక రెడ్డి, ఒక బీసీ మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ప్రాంతాల ఆధారంగా, సామాజికవర్గాల కోణాన్ని పరిశీలించి మరో ఇద్దరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని తెలిసింది. అయితే ఎవరికీ అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్‌. ఇక ఏపీలో మిత్రపక్షాల నుండి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ప్రచారం ఉన్నది. ఏపీలో మిత్రపక్షాలకు చోటు కల్పిస్తే జనసేనకు అవకాశం కల్పిస్తారని, మచిలీపట్నం జనసేన పార్లమెంటు సభ్యుడు బాలశౌరికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Also Read : స్టార్‌ సింగర్‌ పై గన్‌ఫైర్.. 20 రౌండ్ల కాల్పులు.. యూట్యూబర్ అంకిత్ స్పాట్ డెడ్!

కాగా, కేంద్ర మంత్రి వర్గంలో ఇప్పటికే ధర్మేంద్ర ప్రదాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరొకవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మంత్రివర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను వేగంగా పనిచేయలేకపోతున్నానని ఆయన చెప్పడం వెనక ఇదే కారణమని తెలుస్తోంది. మరికొందరు సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ప్రాంతీయ సమీకరణాలు, కూటమి పార్టీలకు సముచిత స్థానం కల్పించడంపై దృష్టి పెట్టిన ప్రధాని సీనియర్ నేతలను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరీ వయసు మీరిన వారిని మంత్రి వర్గంలో ఉంచకుండా వేగంగా పనిచేసిన వారిని తన మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.