
దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివరణ ఇచ్చింది. ఈ20 పెట్రోల్‌ను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో పాత ఈ10 పెట్రోల్‌ను తీసుకొస్తున్నారంటూ వస్తున్న వార్తలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు E20ని E10తో భర్తీ చేసే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు.
గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అయితే పాత వాహనాలు వాడుతున్న కొందరు వినియోగదారులు తమ వాహనాల పనితీరు తగ్గిందని, ఇంజిన్ పార్ట్స్, రబ్బర్ సీల్స్ దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్బ్యురేటర్ ఉండే పాత వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడినప్పుడు ఇంధనం సరిగా అందక ఇంజిన్ త్వరగా వేడెక్కే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత వాహనాల ప్రయోజనాలను కాపాడటానికి E20తో పాటు తక్కువ ఇథనాల్ ఉండే E10 పెట్రోల్‌ను కూడా ఒక ఆప్షన్‌గా అమ్మాలా? అనే దానిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది.
బీపీసీఎల్ సిఎమ్‌డి సంజయ్ ఖన్నా మాట్లాడుతూ.. ఒకవేళ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమం విధానాన్ని మార్చి E20 నుంచి E10కి మారాలని ఆదేశిస్తే ఆయిల్ కంపెనీలకు ఆపరేషనల్ గా ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. ఇప్పటికే ఈ20 కోసం వ్యవస్థలు ఉన్నందున ఇది పెద్ద సవాలు కాదన్నారు. అయితే అసలు సమస్యల్లా ఈ20ని తొలగించడం కాదని.. ఈ20తో పాటు అదనంగా ఈ10 పెట్రోల్‌ను కూడా బంకుల్లో విక్రయించడమని తెలిపారు. దేశంలో లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఒకేసారి రెండు, మూడు రకాల పెట్రోల్ వేరియంట్లను నిల్వ ఉంచడం, రవాణా చేయడం భారీ లాజిస్టికల్ సవాలుగా మారుతుంది. టెర్మినల్స్, డిపోలు, పైప్లైన్ల నెట్వర్క్ అంతటా విడివిడిగా ఇంధనాన్ని సరఫరా చేయడం వల్ల ఆయిల్ కంపెనీలపై నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.









