
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఉజ్బెకిస్థాన్ చేరుకున్నారు. రాజధాని తాష్కెంట్ విమానాశ్రయంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ స్వయంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ రంగం, ఇంధనం, విద్యతో పాటు ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరపనున్నారు.
తాష్కెంట్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. అధ్యక్షుడు మిర్జియోయేవ్ తనకు ప్రత్యేకంగా స్వాగతం పలకడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉజ్బెకిస్థాన్‌కు తాను రావడం ఇది నాలుగోసారి అని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఉజ్బెకిస్థాన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్‌ను సందర్శించారు. అక్కడి స్వాతంత్ర్య స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్ కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.
ఉజ్బెకిస్థాన్‌కు బయలుదేరే ముందు కూడా ప్రధాని మోదీ ఇరు దేశాల సంబంధాలపై మాట్లాడారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిందని చెప్పారు. అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో జరిగే చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధనం వంటి అనేక అంశాలు ఉంటాయని ప్రధాని తెలిపారు.
పర్యటనలో భాగంగా తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మా గాంధీ సెంటర్‌ను కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ ప్రదేశాలను సందర్శించనున్నట్లు తెలిపారు.
ఉజ్బెకిస్థాన్ పర్యటన పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొంటారు. SCO ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సు జరగనుంది. భారత్ 2017 నుంచి SCOలో పూర్తి సభ్య దేశంగా ఉంది.









