Thalapathy Vijay :తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ తమిళనాడుకే పరిమితం కాదు. కాబోయే ప్రధాని అంటూ టీవీకే ప్రచారం చేయడం సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రధానికి మోదీకి ప్రత్యమ్నాయం విజయ్‌ అనే ప్రచారం చేయడం రాజకీయ వర్గా్‌ల్లో చర్చనీయంశంగా మారింది. విజయ్‌ కేవలం తమిళనాడుకే పరిమితం కాదని ఆయనో జాతీయ స్ఫూర్తినేతగా, భవిష్యత్తు ప్రధానిగా టీవీకే నేతలు అభివర్ణించడం సంచలనంగా మారింది. పార్టీ శ్రేణులు కూడా సోషల్‌ మీడియాలో అదే తరహాలో పోల్చుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సీనియర్‌ నేత, రెవెన్యూశాఖ మంత్రి కె.ఎ.సెంగోట్టైయన్‌ ఇటీవల తిరుప్పూర్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ తాను ఎంజీఆర్, జయలలిత వంటి లెజెండ్‌లతో కలిసి పనిచేశానని, విజయ్‌ వారికి మించిన శక్తిగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. విజయ్‌ తమిళనాడుకే పరిమితం కారని, భావిభారతాన్ని సైతం పాలిస్తారని ఆకాశానికి ఎత్తేశారు. ఉత్తర భారతదేశ ప్రజలు కూడా విజయ్‌ పాలనను ఇష్టపడుతున్నారని, దేశాన్ని పాలించే అర్హతలు విజయ్‌కి ఉన్నాయని ఆయన వివరించడం సంచలనంగా మారింది.

ఆయన మాత్రమే కాదు మానవ వనరులశాఖమంత్రి డి.శరత్‌కుమార్‌ కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్‌ నిజాయతీగా పని చేస్తారని, ఆయన దేశానికి కాబోయే ప్రధాని అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. నిత్యం శ్రమించే ఆయన ఆ పదవిని కచ్చితంగా అధిరోహిస్తారని పేర్కొన్నారు. అలాగే దేశంలోని ఐదారు ఉత్తర భారత రాష్ట్రాలు మాత్రమే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తుండటం సరికాదని, క్రీడాభివృద్ధిశాఖ మంత్రి ఆదవ్‌ అర్జున అన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇక్కడి రాజకీయ ప్రాధాన్య హక్కుల్ని హరించివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మార్పు కోరుకుంటున్నామన్నారు. అంటే పరోక్షంగా దక్షిణాది వాసులు ప్రధాని కావాలని ఆయన చెప్పారు.

తమిళనాడు రాజకీయాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న టీవీకే కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోనూ పుంజుకునే దిశగా అడుగులు వేస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో భాగంగా మొదట కేరళ రాష్ట్రానికి టీవీకే అధ్యక్షుడిగా దక్షిణాది సినీనటుడు దేవన్‌ను నియమించేందుకు టీవీకే శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. కాగా గతంలో భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా వెంటనే టీవీకేలో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. సెప్టెంబరు 10న తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌తో భేటీ తర్వాత ఆయనను కేరళ టీవీకే పార్టీ అధ్యక్షునిగా ప్రకటించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. కేరళలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే టీవీకే శ్రేణులు బలంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే అక్కడ పార్టీ విస్తరణకు అవసరమైన సన్నాహక శిబిరాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణపై చర్చలు సాగుతున్నాయి. తమిళనాడు పాలనలో విజయ్‌ స్ఫూర్తిమంతమైన పాలనను అందిస్తున్నారని చెబుతూ ఉత్తరాది రాష్ట్రాల్లోని సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం విశేషంగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా అక్కడ కూడా పార్టీ విస్తరించడంతో పాటు జాతీయ నేతగా ఆయనను నిలిపేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో దక్షిణాది నుంచి ప్రధాని రేసులో విజయ్‌ ఉంటే ప్రాంతీయ పార్టీలు అయనకు ఎలాంటి మద్ధతు ఇస్తాయో వేచి చూడాల్సిందే.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.