
Nepal : నేపాల్‌లో భారీ వరదలు వచ్చి ఇప్పటికే 7 రోజులు అయ్యింది. ఈ భయంకరమైన వరదలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటివరకు 1,127 మంది చనిపోగా మరో 4 వేల మంది వరకు కనిపించకుండా పోయారు. ఆగస్టు 26 తర్వాత నేపాల్ నుంచి బయటకు వచ్చిన వరదల ఫొటోలు, వీడియోలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఎక్కడ చూసినా భారీగా నీరు, మట్టి, రాళ్లు కొట్టుకొచ్చిన దృశ్యాలే కనిపించాయి. అసలు ఇంత వేగంగా వచ్చిన వరద నుంచి మనిషి పరిగెత్తి తప్పించుకోగలడా? అనే ప్రశ్న చాలామందిలో వచ్చింది. దీనిపై జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అంత వేగంగా వచ్చిన వరద నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి కూడా తప్పించుకోలేడట.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు ఈ వరద ఎలా వచ్చిందో అంచనా వేశారు. వారి లెక్కల ప్రకారం.. టిబెట్‌లోని గ్యిరోంగ్ పోర్ట్ వద్దకు వరదలోని మట్టి, రాళ్ల ప్రవాహం వచ్చినప్పుడు దాని వేగం సెకనుకు 19 మీటర్లు ఉంది. అంటే గంటకు దాదాపు 68 కిలోమీటర్ల వేగం అన్నమాట. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తిన ఉసేన్ బోల్ట్ 2009లో 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఆ సమయంలో అతని సగటు వేగం సెకనుకు దాదాపు 10 మీటర్లు. కానీ నేపాల్‌ను ముంచెత్తిన ఈ వరద ప్రవాహం దానికి దాదాపు రెండింతల వేగంతో వచ్చింది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మనిషి పరిగెత్తి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకుల ప్రకారం.. ఈ భారీ విపత్తుకు కారణం కొండ ప్రాంతంలోని గ్లేసియర్ కూలిపోవడం. గ్లేసియర్ కూలిపోవడంతో పెద్ద మొత్తంలో మంచు, రాళ్లు, మట్టి ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చాయి. మొదట మంచు, రాళ్ల ప్రవాహం మొదలై.. ఆ తర్వాత అది మట్టి ప్రవాహంగా మారింది. చివరకు భారీ వరదగా మారింది. ఈ ప్రవాహం టిబెట్‌లోని గ్యిరోంగ్ పోర్ట్ వరకు దాదాపు 22 కిలోమీటర్లు చాలా వేగంగా దూసుకొచ్చింది. అక్కడి నుంచి కూడా ఆ ప్రవాహం కిందికి కొనసాగింది.
టిబెట్ సరిహద్దు నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్‌లోని త్రిశూలి నదిపై ఉన్న వంతెనకు ఈ వరద చేరుకునే సమయానికి కూడా దాని వేగం చాలా ఎక్కువగానే ఉంది. అప్పుడు కూడా నీటి ప్రవాహం సెకనుకు 11.7 మీటర్ల వేగంతో కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే సుమారు గంటకు 42 కిలోమీటర్ల వేగం. టిబెట్ సరిహద్దు దగ్గర నుంచి ఆ వంతెన వరకు వరద చేరుకోవడానికి కేవలం 46 నుంచి 75 నిమిషాల సమయం మాత్రమే పట్టినట్లు పరిశోధనలో తేలింది.









