
ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో చిన్నపిల్లలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. చదువు కంటే ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. దీనివల్ల చిన్న పిల్లలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెటా సహా పలు ప్రముఖ సాంకేతిక కంపెనీలు చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మెటా సంస్థ అమెరికాలోని పలు రాష్ట్రాలతో ఏకంగా 18 బిలియన్ డాలర్ల చారిత్రాత్మక ఒప్పందానికి అంగీకరించింది. ఈ క్రమంలో తమ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులలో పిల్లలు ఎవరో, పెద్దలు ఎవరో కచ్చితంగా గుర్తించడం సోషల్ మీడియా కంపెనీలకు అతిపెద్ద బాధ్యతగా మారింది. దీనికోసం సాంకేతిక సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను రంగంలోకి దించాయి.
సాధారణంగా ఆఫ్‌లైన్ ప్రపంచంలో వయస్సును నిరూపించుకోవడానికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉపయోగిస్తుంటారు. ఆన్లైన్లో కూడా మెటా వంటి కంపెనీలు ఐడీలను స్వీకరిస్తూ వాటిని 30 రోజుల్లో డిలీట్ చేస్తామని చెప్తుంది. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వివరాలను టెక్ దిగ్గజాలకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. దీంతో మెటా, యూట్యూబ్, టిక్‌టాక్, రోబ్లాక్స్ వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఏఐ సాంకేతికత వినియోగదారుల పుట్టిన తేదీని నేరుగా ధృవీకరించలేకపోయినా.. వారి ఆన్లైన్ ప్రవర్తన, నమూనాల ఆధారంగా వయస్సును దాదాపు కచ్చితంగా అంచనా వేస్తోంది.
Also Read : స్టాలిన్‌కు దిమ్మతిరిగే షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు!
యూజర్లు పోస్ట్ చేసే బర్త్‌డే విషెస్, పాఠశాల లేదా కాలేజీకి సంబంధించిన సమాచారం, వారు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు, వారి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎక్కువగా ఏ వయస్సు వారు ఉన్నారు అనే అంశాలను ఏఐ పరిశీలిస్తోంది. దీని ఆధారంగా కిడ్స్ వయస్సును సరిగ్గా కాకపోయిన కొంత వరకు గుర్తించవచ్చు. అలాగే సాధారణంగా పాఠశాల వేళల్లో ఆఫ్‌లైన్‌లో ఉండి సాయంత్రం లేదా వారాంతాల్లో మాత్రమే ఆన్‌లైన్‌కి వచ్చే ఖాతాలను ఏఐ స్కూల్ విద్యార్థుల అకౌంట్లుగా భావించవచ్చు. యూజర్లు పోస్ట్ చేసే ఫోటోలలోని ముఖ నిర్మాణం, ఎత్తు, శారీరక మార్పులను విశ్లేషించి వారి సాధారణ వయస్సును ఏఐ పసిగడుతుంది. వీటితో పాటు యోతి వంటి గుర్తింపు సంస్థల సహకారంతో రోబ్లాక్స్ వంటి గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల నుండి ‘వీడియో సెల్ఫీలు’ తీసుకుంటున్నాయి. ముఖం కదలికలు, చర్మ లక్షణాలను స్కాన్ చేయడం ద్వారా 5 నుండి 25 ఏళ్ల వయస్సు గల వారిని ఈజీగా అంచనా వేస్తుంది. ఇలా ఏఐ చెక్ చేసేటప్పుడు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అకౌంట్‌గా గుర్తిస్తే.. వెంటనే ఆ ఖాతాను తొలగించడంతో పాటు ఆ అకౌంట్‌తో నిరంతరం సంప్రదించే ఫ్రెండ్స్ లిస్ట్‌లోని ఇతర ఖాతాల వయస్సును కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తుంది.
అయితే ఇలాంటి వయస్సు తనిఖీల విధానంపై డిజిటల్ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లేదా ప్రవర్తనా డేటాను సేకరించడం వల్ల వినియోగదారుల ప్రైవసీ దెబ్బతింటుందని, ఈ డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే భద్రతా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ యుగంలో పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతనే వినియోగిస్తున్నాయి.
Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. గేమ్ ప్లాన్ అంతా రివర్స్.. పౌరసత్వంపై అమెరికా కోర్టు సంచలన ట్విస్ట్!









