కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితంగా దాచుకోవాలని భావించే వారికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు, వ్యాపారాల్లో ఉండే నష్టభయం లేకుండా, నిర్ణీత కాలానికి గ్యారెంటీ రాబడి కోరుకునే వారి కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ స్కీమ్. 444 రోజుల కాలపరిమితి ఉన్న ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం స్వల్పకాలంలో గరిష్ట లాభాలు పొందాలనుకునే పెట్టుబడిదారులను, ముఖ్యంగా పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్లను ఆకట్టుకుంటోంది.

Also Read : సిబిల్ స్కోర్ పడిపోయిందా? ఈ 6 ట్రిక్స్‌తో జస్ట్ 6 నెలల్లో పెరగడం గ్యారెంటీ!

సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే ఎస్‌బీఐ ఈ ప్రత్యేక ‘అమృత్ వృష్టి’ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది. కస్టమర్ల వయస్సును బట్టి వడ్డీ శాతాలు ఉన్నాయి. 60 ఏళ్ల లోపు డిపాజిటర్లకు ఏడాదికి 6.45 శాతం చొప్పున స్థిరమైన వడ్డీ లభిస్తుంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సాధారణ కస్టమర్ల కంటే అదనంగా 0.50 శాతం వడ్డీని పొందుతారు. అంటే వీరికి వార్షికంగా 6.95 శాతం వడ్డీ అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారు వయోవృద్ధులకు మరింత మేలు చేస్తూ, ఎస్‌బీఐ వీరికి గరిష్టంగా 7.05 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కాలపరిమితి 444 రోజులు, అంటే సుమారు 14.5 నెలలు మాత్రమే. అతి తక్కువ వ్యవధిలోనే స్థిరమైన, మెరుగైన రాబడిని ఆశించే వారికి ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్‌లో చేరడానికి పెద్ద మొత్తంలో సొమ్ము ఉండాల్సిన అవసరం లేదు. కనీసం రూ. 1,000 నుంచి డిపాజిట్ ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

డిపాజిటర్లు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీని పొందే వెసులుబాటు ఉంది. ప్రతి నెలా ఖర్చుల కోసం కావాలనుకునే వారు నెలవారీగా, లేదా త్రైమాసిక, అర్ధసంవత్సర ప్రాతిపదికన వడ్డీ ఆదాయాన్ని తీసుకోవచ్చు. లేదా మెచ్యూరిటీ సమయంలో అసలుతో కలిపి ఒకేసారి పొందవచ్చు. అత్యవసరంగా డబ్బు అవసరమైతే, ఎఫ్‌డీని క్యాన్సిల్ చేయకుండానే డిపాజిట్ చేసిన సొమ్ముపై బ్యాంకు నుంచి లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ పొందే సౌకర్యం ఉంది. ఏవైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే, గడువు ముగియక ముందే ఎఫ్‌డీని క్లోజ్ చేసుకుని సొమ్మును వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎస్‌బీఐ అమృత్ వృష్టి ఎఫ్‌డీలో చేరడం చాలా సులభం. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే డిజిటల్ పద్ధతిలో నిమిషాల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘YONO’ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి ‘Deposits’ సెక్షన్‌లో ‘Amrit Vrishti’ స్కీమ్‌ను ఎంచుకుని డిపాజిట్ చేయవచ్చు.

Also Read : ఎండుచేపల లవర్స్‌కు అలర్ట్.. టేస్ట్‌లో సూపర్ కానీ.. అతిగా తింటే ఆసుపత్రిలో బెడ్ తప్పదు!