Japan Floods
Japan Floods

జపాన్‌.. టెక్నాలజీకి పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యంత కచ్చితత్వంతో నడిచే రైళ్లు.. పటిష్టమైన రోడ్లు.. అత్యాధునిక డ్రైనేజీ, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలోనూ జపాన్‌ ముందుంటుంది. కానీ ఇప్పుడు అదే జపాన్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. సెంట్రల్‌ జపాన్‌లో కుండపోత వర్షాలు కురవడంతో నగోయా సహా పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒక్క గంటలోనే 104 మిల్లీమీటర్ల వర్షం.. రోడ్లను నదులుగా మార్చేసింది. రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి.. మెట్రో సేవలు నిలిచిపోయాయి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ భారీ వర్షాలకు కారణమేంటి..? ఒక్కసారిగా ఇంతటి వరద పరిస్థితి ఎందుకు వచ్చింది..? జపాన్‌లో సునామీ వచ్చే ఛాన్స్ ఉందా..? ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం

సెంట్రల్‌ జపాన్‌లోని ఐచి, గిఫు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలకు ప్రధాన కారణం లీనియర్ రెయిన్‌బాండ్స్. సాధారణంగా వర్షపు మేఘాలు ఒక ప్రాంతం మీదుగా కదులుతుంటాయి. కానీ లీనియర్ రెయిన్‌బాండ్ ఏర్పడితే.. ఒకదాని తర్వాత మరొకటి వర్షపు మేఘాలు అదే ప్రాంతంలో వరుసగా ఏర్పడతాయి. అంటే ఒకే ప్రాంతంపై గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే తడిసిన నేలపై మళ్లీ మళ్లీ భారీ వర్షం పడటంతో నీరు వేగంగా పేరుకుపోయింది. నదులు, డ్రైనేజీ వ్యవస్థలపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా కొన్ని గంటల్లోనే సాధారణ వర్షం.. తీవ్రమైన వరద పరిస్థితిగా మారిపోయింది.

ఈ వర్షం తీవ్రత ఎంత ఉందో నగోయాలో నమోదైన వర్షపాతమే చెబుతోంది. ఒక్క గంటలో 104 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా నీరు చేరడంతో డ్రైనేజీ వ్యవస్థలు తట్టుకోలేకపోయాయి. రోడ్లు జలమయమయ్యాయి. చికుసా, మోరియామా, మీటో వార్డుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వేగంగా చేరే అవకాశం ఉండటంతో.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

Also Read : చంద్రునిపై జనావాసాలు.. నాసా – ఇస్రో బిగ్ ప్లాన్..

ఇక వరద పరిస్థితి తీవ్రం కావడంతో నదులపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. షోనై నదికి లెవల్ 5 వరద హెచ్చరిక జారీ అయింది. గిఫు, ఐచి ప్రిఫెక్చర్ల మీదుగా ప్రవహించే ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Level-5 అంటే వరద ముప్పు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ఇచ్చే అత్యున్నత స్థాయి హెచ్చరిక. అంటే పరిస్థితి మరింత దిగజారే వరకు వేచి చూడటం కాదు.. ఇప్పటికే ప్రమాద ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.

మరి ఇంతటి వరదలతో సునామీ ముప్పు కూడా ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జపాన్‌ అనగానే సునామీ భయం గుర్తుకొచ్చినా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. సెంట్రల్ జపాన్‌ను హెవీ రెయిన్, వరదలు, కొండచరియలు విరిగిపడటం ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. అత్యవసర హెచ్చరికలు కూడా వరద ప్రమాదం చుట్టూనే ఉన్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు నీటమునగడం, కొండ ప్రాంతాల్లో నేల బలహీనపడటమే ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది.

అయితే ఈ వరద ప్రభావం కేవలం లోతట్టు ప్రాంతాలకే పరిమితం కాలేదు. నగోయా నగర రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. రద్దీగా ఉండే సకాయే ప్రాంతంలో ఒక దశలో మోకాలి లోతు వరకు వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి. మరోవైపు JR చువో లైన్ రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మెట్రో సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే వరద నీరు రోడ్లను మాత్రమే కాదు.. నగరంలోని అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ మొత్తాన్ని స్తంభింపజేసింది.

జపాన్‌ అంటేనే ప్రపంచానికి గుర్తొచ్చేది.. టైమ్-బౌండ్ రైలు సర్వీసులు. నిమిషాల లెక్కన రైళ్లు నడిచే ఈ దేశంలో.. భారీ వర్షాల కారణంగా షింకన్‌సెన్ సేవలు కూడా ప్రభావితమయ్యాయి. JR సెంట్రల్ ప్రకారం.. టోక్యో వైపు వెళ్లే టోకైడో షింకన్‌సెన్ రైళ్లు ఒక దశలో ఒకాయామా-టోక్యో స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. టోక్యో-నగోయా మధ్య బయలుదేరే రైళ్లను కూడా నిలిపివేశారు. JR వెస్ట్ ప్రకారం వర్షాల కారణంగా సాన్యో షింకన్‌సెన్ సేవలు కూడా పాక్షికంగా ప్రభావితమయ్యాయి. అయితే పరిస్థితులు కొంత మెరుగుపడటంతో టోకైడో, సాన్యో షింకన్‌సెన్ సేవలు సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభమయ్యాయి.

రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రజల భద్రతపైనా ప్రభావం పడింది. భారీ వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది. సుమారు 2,700 మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో ఉండటమే ప్రమాదకరంగా మారడంతో అధికారులు తరలింపు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నదుల సమీపంలో, లోతట్టు ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అధికారుల హెచ్చరికలను పాటించాలని సూచించారు.

Also Read : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ధమాకా.. మార్కెట్‌లోకి ఐఫోన్ 18 ప్రో మోడల్స్.. నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, రేట్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఇదిలా ఉంటే.. ఈ భారీ వర్షాల ప్రభావం జపాన్‌లో జరగబోయే ఆసియా క్రీడల ఏర్పాట్లపైనా పడింది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడల వేదికల్లోనూ పలు చోట్ల వర్షపు నీరు చేరింది. అంతర్జాతీయ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో అక్కడికి చేరుకున్న క్రీడాకారులు, సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. కొన్ని వేదికల్లో పైకప్పుల నుంచి నీరు కారినట్లు అధికారులు తెలిపారు.

అయితే ప్రమాదం సెంట్రల్ జపాన్‌తోనే ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. పశ్చిమం నుంచి ఈశాన్య జపాన్‌ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. టోక్యో, సైతామా, చిబా, కనగావా ప్రాంతాలతో పాటు పశ్చిమ జపాన్‌లోని ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియల ముప్పు పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

భారీ వర్షాలు ఎక్కువసేపు కొనసాగితే మరో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.. అదే కొండచరియలు విరిగిపడటం. నేలలోకి భారీగా నీరు చేరడంతో కొండ ప్రాంతాల్లో మట్టి పట్టుకోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే వాతావరణ సంస్థ వరదలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదంపైనా ప్రజలను హెచ్చరించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

జపాన్‌లో కురిసిన భారీ వర్షాలు.. ఆ దేశంలోని అత్యాధునిక మౌలిక వసతులపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. షింకన్‌సెన్ నుంచి మెట్రో వరకు అత్యంత కచ్చితత్వంతో పనిచేసే రవాణా వ్యవస్థలు ఉన్నప్పటికీ.. భారీ వర్షాల ధాటికి రోడ్లు నీటమునిగాయి, రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, మెట్రో సేవలు నిలిచిపోయాయి. పరిస్థితి తీవ్రం కావడంతో పలుచోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. దీంతో టెక్నాలజీలో ప్రపంచంలోనే ముందున్న జపాన్‌లోనూ.. విపరీత వాతావరణ పరిస్థితులు ఎంతటి అంతరాయాన్ని సృష్టించగలదో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

ఐచి ప్రిఫెక్చర్‌ జపాన్‌ పారిశ్రామిక రంగానికి కూడా కీలకమైన ప్రాంతం. ప్రపంచ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఇలాంటి కీలక పారిశ్రామిక ప్రాంతంలో రవాణా వ్యవస్థలు, రోడ్లు ప్రభావితమైతే.. దాని ప్రభావం కేవలం ప్రయాణికులకే పరిమితం కాదు. సరఫరా గొలుసు, వ్యాపార కార్యకలాపాలపైనా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే అధికారులు ప్రస్తుతం ప్రజల భద్రతతో పాటు కీలక మౌలిక వసతుల పరిస్థితిపైనా దృష్టి పెట్టారు.

ఇప్పుడు పరిస్థితి మరింత కీలకంగా మారింది. ఇప్పటికే భారీ వర్షాలతో నదుల్లో నీటి మట్టాలు పెరగడంతో పాటు.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. కొండ ప్రాంతాల్లో నేల బలహీనపడింది. మరోసారి లీనియర్ రెయిన్‌బ్యాండ్స్ ఏర్పడి వర్షాలు కొనసాగితే వరదల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. వర్షం తగ్గిన తర్వాత కూడా నదుల్లో నీటి ప్రవాహం, నిలిచిపోయిన వరద నీరు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం వెంటనే తగ్గిపోదు. అందుకే పరిస్థితి కాస్త సాధారణంగా కనిపించినా.. ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు భావించే పరిస్థితి లేదు. అధికారుల హెచ్చరికలు పూర్తిగా ఉపసంహరించే వరకు నదీ పరివాహక, లోతట్టు, కొండ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

మొత్తంగా.. టెక్నాలజీకి, అత్యాధునిక మౌలిక వసతులకు ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిచిన జపాన్‌ను.. ప్రకృతి ప్రాకోపం ఒక్కసారిగా కుదిపేసింది. ఇప్పుడు వర్షాలు ఇలాగే కొనసాగితే.. వరదలతో పాటు కొండచరియలు, మరిన్ని ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవలే భారీ వరదలతో నేపాల్‌ ఎదుర్కొన్న విధ్వంసం ఇంకా కళ్లముందే ఉంది. మరి.. జపాన్‌ కూడా మరో నేపాల్‌లా మారుతుందా..? లేక సాంకేతికత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో ఈ విపత్తును అదుపులోకి తీసుకురాగలదా..? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.