
UAE Jobseeker Visa : యుఏఈలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ ఉద్యోగార్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బంపరాఫర్ ప్రకటించింది. స్థానికంగా యజమాని లేదా స్పాన్సర్ ఎవరూ లేకపోయినా యూఏఈకి వచ్చి ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం కల్పిస్తోంది. దీనికోసం సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘దుబాయ్ జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ విజిట్ వీసా’ద్వారా అర్హులైన అభ్యర్థులు నేరుగా దుబాయ్ వచ్చి, ఇంటర్వ్యూలకు హాజరవ్వడమే కాకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో పాల్గొని ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడానికి అవకాశం కల్పించింది. దీని కోసం 60, 90, 120 రోజుల కాల వ్యవధితో కూడిన సింగిల్ ఎంట్రీ వీసాలను అందించనుంది. దీంతో అర్హత కలిగిన భారత ఉద్యోగార్థులు ముందుగా ఎలాంటి జాబ్ ఆఫర్ లేకుండానే యూఏఈకి వెళ్లి, ఉద్యోగం వెతుక్కోవడానికి వెసులుబాటు లభించనుంది. వారు అక్కడ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. నియామక ప్రక్రియలో పాల్గొనచ్చు. ఈ మేరకు ఎమిరేట్స్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. భారత్‌లోనే ఉంటూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి బదులుగా, దుబాయ్ నుంచే స్వయంగా ఉద్యోగ వేట సాగించాలనుకునే వారికి ఈ వీసా అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.
కాగా యుఏఈలో ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులు తమ ఉద్యోగ వేట సమయానికి తగినట్లుగా 60, 90 లేదా 120 రోజుల గడువు ఉన్న వీసాలను ఎంచుకోవడానికి అవకాశం కల్పించింది. వర్తించే నిబంధనలు,అనుమతులకు లోబడి ఈ వీసా వ్యవధిని పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా మొత్తం బస చేసే సమయం గరిష్టంగా 180 రోజుల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read : ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడు.. మసూద్ పెజెష్కియన్
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీసా ఇవ్వరు. విద్యార్హతలు, నైపుణ్యాల స్థాయి, ఆర్థిక వనరులను బట్టి వీసాలను యూఏఈ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ వీసాను ప్రధానంగా నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం మాత్రమే తీర్చిదిద్దారు. దరఖాస్తుదారులు సాధారణంగా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే వారు వెతికే ఉద్యోగాలు యుఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ (MOHRE) వర్గీకరణ ప్రకారం స్కిల్ లెవల్ 1, 2 లేదా 3 కిందకు రావాల్సి ఉంటుంది.
భారత్‌కు చెందిన ఇటీవలే ఉత్తీర్ణులైన డిగ్రీ విద్యార్థులు కూడా దీనికి అర్హులు. గుర్తింపు పొందిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాలలో ఒకదాని నుండి గత రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేసినట్లయితే వారు ఈ వీసాకు అర్హత సాధిస్తారు.దీనితో పాటు, యుఏఈలో ఉండే సమయంలో తమ ఖర్చులను భరించడానికి సరిపడా ఆర్థిక స్తోమత ఉన్నట్లు దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
భారతీయ దరఖాస్తుదారులకు కావలసిన పత్రాలు:
ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది పత్రాలను సిద్ధం చేసుకోవాలి:
కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్
ఇటీవల తీయించుకున్న ఫోటోగ్రాఫ్‌లు
అటెస్టేషన్ (ధృవీకరణ) పూర్తి చేసిన విద్యా అర్హతల పత్రాలు
వర్తించే సందర్భాల్లో ఆర్థిక స్తోమత నిరూపించే పత్రాలు (Proof of financial means)
దరఖాస్తుదారుల కేటగిరీని బట్టి అవసరమయ్యే ఇతర పత్రాలు
దరఖాస్తులను GDRFA దుబాయ్ లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు.
దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, కావలసిన వీసా వ్యవధిని ఎంచుకుని, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, రుసుమును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత వీసా ఎలక్ట్రానిక్ రూపంలో (e-Visa) జారీ అవుతుంది.
Also Read : భారత్ – పాక్ లెంజెండ్స్ టోర్నీ.. బహిష్కరిస్తారా? బరిలోకి దిగుతారా?
వీసాతో ఉద్యోగ హామీ లభించదు:
దుబాయ్ జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ విజిట్ వీసా పొందడం అంటే ఉద్యోగం వచ్చినట్లు కాదు. అభ్యర్థులు తాజా అర్హత నిబంధనలు, ఫీజులు ,వీసా నిబంధనలను యుఏఈ ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా స్వయంగా సరిచూసుకోవాలి.
అలాగే, డబ్బులు ఇస్తే యుఏఈ ఉద్యోగం లేదా వీసా ఇప్పిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లు లేదా సంస్థల పట్ల ఉద్యోగార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.









