
Road Accident : హైదరాబాద్ నగరంలోని కోకాపేట్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక నియోపోలిస్ సమీపంలో ఇన్నోవా క్రిస్టా కార్ అదుపుతప్పి రోడ్డు పై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రమాదంలో మృతి చెందిన మదన్ మోహన్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా విద్యార్థులంతా హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని పోలీసులు గుర్తించారు. వారిలో స్నేహితుడు తమన్ వర్మ పుట్టిన రోజు వేడుకలను మియాపూర్‌లో ఈ 8 మంది విద్యార్థులు కలిసి జరుపుకున్నారని తెలిపారు.
అనంతరం వీరంతా ఇన్నోవా క్రిస్టా కారులో లాంగ్ డ్రైవ్ కోసం మియాపూర్ నుంచి కోకాపేట్‌లోని నియో పోలీస్‌కి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే వారంతా మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కారులో ప్రయాణించిన వారంతా ఇంటర్ విద్యార్థులేనని..అంతా మైనర్లని పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు నార్సింగ్ పోలీసులు చెప్పారు. కాగా, గాయపడిన వారిలో ఒకరిద్దరికీ తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది.









