
India Women Asia Cup : ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత అమ్మాయిలు మరోసారి తమ సత్తా చాటారు. భారత మహిళలు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆసియాక్‌పను సొంతం చేసుకోవడం సంచలనమేనని చెప్పాలి. ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌కు తోడు తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ బంతితో అదరగొట్టడంతో ఫైనల్లో లంకను చిత్తు చేసి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), స్మృతీ మంధాన (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) దూకుడుగా ఆడి అర్ధ శతకాలు నమోదు చేశారు. తెలుగు అమ్మాయి శ్రీచరణి (4/20), దీప్తి శర్మ (3/19) స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని చిత్తు చేశారు. దీంతో ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంప్ శ్రీలంకను ఓడించింది. టోర్నీలో ఒక ఓటమికూడా లేకుండా ఆద్యంతం అజేయంగా నిలిచిన హర్మన్ సేన.. రికార్డుస్థాయిలో 8వసారి ఆసియా టైటిల్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. వన్డే ఫార్మాట్లో నాలుగుసార్లు విజయం సాధించిన భారత్.. టీట్వంటీ ఫార్మాట్లో కూడా నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. కాగా తరువాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఓవర్లన్నీ ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (36), నీలాక్షిక సిల్వ (22), విష్మి గుణరత్నే (20) టాప్ స్కోరు సాధించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రతికా రావత్ స్థానంలో బదులు కమలిని భారత జట్టులోకి వచ్చింది.
భారీ స్కోరును ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన లంక ఓపెనర్ ఇమేష (4)ను క్రాంతి తొలి ఓవర్లోనే బౌల్డ్ చేసి ఆ జట్టుకు షాకిచ్చింది. అయితే, మరో ఓపెనర్ చమరి ఆటపట్టు, విష్మి నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 58 పరుగులతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఐదో ఓవర్లో చమరి 4,6 బాదడంతో.. ఆరు ఓవర్లు ముగిసే సరికి లంక 38/1తో నిలవడం గమనార్హం. మధ్య ఓవర్లలో వీరిద్దరూ ఆచితూచి ఆడడంతో లంక సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగింది. దీంతో చమరి 4,6,4తో దూకుడు పెంచే ప్రయత్నం చేసింది. కానీ, 10వ ఓవర్లో ఆటపట్టు, విష్మిని దీప్తి అవుట్ చేయడంతో లంక 63/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన హర్షిత (9), కవిష (7)తోపాటు నీలాక్షిని శ్రీచరణి అంతగా రాణించలేక పోవడంతో లంక ఓటమి లాంఛనమే అయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్‌కు ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరు తొలి వికెట్‌కు 77 బంతుల్లో 129 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ ఎదుటి జట్టుకు సవాల్ విసరగలిగే స్థితికి చేరుకుంది. 5వ ఓవర్లో చమరి బౌలింగ్‌లో వర్మ 4,6,6తో 20 పరుగులు రాబట్టడంతో.. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 57/0తో నిలకడగా ఉంది. మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 8వ ఓవర్లో బౌండ్రీతో షఫాలీ అర్థసెంచరీ పూర్తి చేసుకోగా.. మంధాన కూడా 4,6తో బ్యాటింగ్‌ను మెరిపించింది. 11వ ఓవర్లో నీలాక్షిక బౌలింగ్‌లో 6,4 బాది స్మృతి కూడా అర్ధ శతకం పూర్తి చేసింది. అయితే ఆ తర్వాత, 3 పరుగుల తేడాతో షషాలీ, మంధాన పెవిలియన్ దారి పట్టడంతో డెత్ ఓవర్లలో భారత్ ఆశించిన రీతిలో రాణించలేక పోయింది. 13వ ఓవర్లో షఫాలీని ప్రబోధ వెనక్కిపంపగా.. ఆ తర్వాతి ఓవర్లో స్మృతి రనౌటైంది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14), రిచా ఘోష్ (17) మూడో వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యంతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, ఘోష్‌తోపాటు హర్మన్, దీప్తి (5) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ దారి పట్టారు. అయితే, ఆఖరి ఓవర్లో కమలిని (15 నాటౌట్) 4,6తో స్కోరును 180 మార్క్ దాటించింది.
కాగా, ఆసియాకప్ ఇప్పటి వరకు పదిసార్లు జరిగితే ఎనిమిదిసార్లు (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022, 2026) భారతే విజేతగా నిలవడం గమనార్హం. బంగ్లాదేశ్ (2018), శ్రీలంక (2024) ఒక్కోసారి విజయం సాధించాయి. భారత్ టీ20, వన్డే ఫార్మాట్లలో 4సార్లు కప్‌ను గెలిచింది.
కప్ అందుకోని భారత జట్టు
గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు కప్ అందుకోని విషయం తెలిసిందే. ఇపుడు అమ్మాయిల జట్టుకూడా అదే దారిలో నడిచింది. దీనికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోసిన్ నఖ్వి (పాక్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్) నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించడమే కారణం. ఆదివారం ఆసియా కప్ మహిళల క్రికెట్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి కూడా నఖ్వి హాజరు కావడంతో మహిళల జట్టు కూడా అతని చేతుల మీదుగా కప్ అందుకోవడానికి నిరాకరించింది. దీంతో విజయం సాధించినప్పటికీ భారత జట్టు కప్ లేకుండానే ఇండియాకు తిరిగిరానుంది.
A proud moment for Indian cricket!
Congratulations to the Women’s team on winning the Asia Cup. Their confidence, consistency and remarkable spirit were on full display throughout the tournament.
May this triumph inspire millions of youngsters across the country to play more and shine.
— Narendra Modi (@narendramodi) September 14, 2026
ప్రధాని మోదీ ప్రశంసలు
భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘భారత క్రికెట్‌కు ఇది ఒక గర్వించదగిన క్షణం. ఆసియా కప్‌ను గెలుచుకున్న మహిళల జట్టుకు అభినందనలు. టోర్నమెంట్ అంతటా వారి ఆత్మవిశ్వాసం, నిలకడ, అద్భుతమైన స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చి.. మరింత మంది క్రీడల వైపు అడుగులు వేసేలా చేయాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు.









