
Gurugram hit and run : రోడ్లపై కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఇతరుల ప్రాణాల మీదకు తెస్తుంది. అహంకారం నెత్తికెక్కి వారు ప్రవర్తించే తీరు ఇతరులకు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. గురుగ్రామ్‌లో ఓ మహిళా బైకర్‌ను ఓ కారు అత్యంత వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ఉన్న వ్యక్తులు తనను వెంబడిస్తూ ఇబ్బంది పెట్టారని, దూరంగా ఉండాలని చెప్పినందుకు కారుతో తన బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై చోటుచేసుకుంది.
బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌కు చెందిన సియా స్పోర్ట్స్ బైక్ నడుపుతుండగా కొందరు వ్యక్తులు కారులో ఆమెను వెంబడించడం మొదలు పెట్టారు. అది గమనించిన ఆమె తన వెంటపడొద్దని సీరియస్‌గా వారిని వారించింది. కారు తనకు దగ్గరగా రావడంతో, కాస్త దూరంగా ఉండాలని చెప్పినట్లు సియా వెల్లడించింది. అయినా కారు ఆగకుండా తనను వెంబడించిందని సియా పేర్కొంది. అనంతరం ఆమె కొంత దూరం వెళ్లాక వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను బలంగా ఢీకొట్టి వెళ్లింది. దీంతో సియా రోడ్డుపై పడిపోయింది. కాగా ఆ స్పీడుకు బైక్ కొంత దూరం జారుతూ వెళ్లిపోయింది. ఈ సంఘటన సియా బైక్‌పై అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డ్ కావడం గమనార్హం.
అదే సమయంలో సియా వెనుక వస్తున్న ఆమె స్నేహితులైన మహిళ బైకర్లు కారును ఆపడానికి ప్రయత్నించారు. దీంతో, కారులోని వ్యక్తి వారిని దుర్భాషలాడుతూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను సియా సోషల్ మీడియాలో షేర్చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. తను బైక్ నడుపుతుండగా తనను అనుసరించినందుకు దూరంగా వెళ్లమనడమే తప్పయిందని, కారులోని వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించారని.. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నారని సియా తెలిపింది. రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె గురుగ్రామ్ పోలీసులను కోరారు









