Pakistan : పాకిస్థాన్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌పై భారీగా రివార్డును పెంచింది. దీంతో అతడిని పట్టుకునేందుకు ఇచ్చే రివార్డు మొత్తం రూ.70 లక్షలకు చేరింది. అక్టోబర్‌లో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (FATF) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మసూద్‌ అజర్‌ను అరెస్టు చేయడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చిన వారికి 2021లో FIA రూ.50 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే అప్పటి నుంచి మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లో లేడని, ఆఫ్ఘనిస్థాన్‌లో దాక్కున్నాడని పాకిస్థాన్‌ చెబుతూ వస్తోంది. అయితే భారత నిఘా సంస్థలు మాత్రం మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో అతడు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిర్వహించిన సాంకేతిక విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

2026లో విడుదల చేసిన FIA రెడ్‌ బుక్‌లో మసూద్‌ అజర్‌ పేరును చేర్చడం, అతడిపై రివార్డును పెంచడాన్ని పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు చూపించే ప్రయత్నంగా భారత వర్గాలు భావిస్తున్నాయి. FATF సమావేశానికి ముందు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశ్నలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంటున్నాయి. మసూద్‌ అజర్‌ భారత్‌లో పలు ఉగ్రదాడులకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్నాడు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించి కూడా మసూద్‌ అజర్‌ పేరు భారత్‌ కోరుతున్న నిందితుల జాబితాలో ఉంది.

పాకిస్థాన్‌ తాజా రెడ్‌ బుక్‌లో 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రదాడులతో సంబంధం ఉన్న 19 మంది పేర్లను కూడా చేర్చింది. ఈ దాడికి అవసరమైన డబ్బు సమకూర్చడం, దాడికి ఉపయోగించిన పడవలను ఏర్పాటు చేయడంలో సహకరించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. వారిలో 17 మంది ఫొటోలు, వారి పాత్రలకు సంబంధించిన వివరాలు రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. అయితే మరో ఇద్దరికి సంబంధించిన ఫొటోలు, లష్కరే తోయిబాతో ఉన్న సంబంధాలు, ఇతర వివరాలను తాజా జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. వారి పేర్లు మాత్రం జాబితాలో ఉన్నాయి. వారిలో తుర్బత్‌కు చెందిన మహ్మద్‌ ఖాన్‌ ఒకరు. 2021 రెడ్‌ బుక్‌లో అతడిని లష్కరే తోయిబా సభ్యుడిగా పేర్కొన్నారు. ముంబై దాడులకు ఉగ్రవాదులను తీసుకెళ్లేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న అల్‌-హుస్సేనీ అనే పడవను అతడు సమకూర్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు.

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజర్‌కు చెందిన జైషే మహ్మద్‌ సంస్థకు కూడా గట్టి దెబ్బ తగిలింది. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న మార్కజ్‌ సుభానల్లా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు భారత సాయుధ బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతం పాకిస్థాన్‌ భూభాగంలో సుమారు 100 కిలోమీటర్ల లోపల ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.