
Samantha : టాలీవుడ్ నటి సమంత త్వరలో తల్లి కాబోతుంది. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సమంత.. భర్త రాజ్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సమంత తనకు భారతీయ సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అయితే ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం తనకు మొదట్లో పూర్తిగా తెలియకపోయినా.. మంత్రాల శబ్దం, జపం సమయంలో ఏర్పడే ఆధ్యాత్మిక శక్తి, తరతరాలుగా వస్తున్న పద్ధతుల్లో ఏదో గొప్ప అర్థం ఉంటుందని తాను ఎప్పుడూ నమ్ముతానని తెలిపారు.
సమంతకు నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకను కళా ఆవరణ లేదా శ్రీ కల్పం అని పిలుస్తారు. ఇది శ్రీ విద్య సంప్రదాయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఈ వేడుకలో దేవికి సంబంధించిన 94 కళలను గౌరవిస్తూ.. వాటిని కాబోయే తల్లి శరీరంలోని ఏడు చక్రాలతో అనుసంధానం చేస్తారని సమంత వివరించారు. ఈ పూజలో పవిత్రమైన నీరు, మంత్రాలను ఉపయోగించి ఆధ్యాత్మిక కేంద్రాలను శుద్ధి చేసి, శక్తివంతం చేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తనకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. తల్లిని సాధారణ మహిళగా కాకుండా సాక్షాత్తూ దేవి రూపంగా భావించి గౌరవించడం అని సమంత చెప్పారు. తల్లి ద్వారా మరో జీవితం ఈ లోకంలోకి రాబోతోందని గుర్తిస్తూ.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు, అలాగే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళకు ఈ వేడుక ఒక ఆశీర్వాదంగా భావిస్తారని ఆమె వివరించారు.
అభిషేకం పూర్తైన తర్వాత కాబోయే తల్లిని పవిత్రమైన శ్రీచక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలకు ప్రతీకలుగా భావిస్తారు. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు సృష్టికి మూలమైన శక్తిని, లలితా త్రిపురసుందరి అమ్మవారి సాన్నిధ్యాన్ని సూచిస్తుందని సమంత తెలిపారు. ఈ వేడుకలో దేవీ ఖడ్గమాలను కూడా పఠిస్తారు. శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలకు సంబంధించిన దేవతల పేర్లు, దైవిక శక్తులను మంత్రాల రూపంలో జపిస్తారు. ఈ మంత్రాలు, జపం ద్వారా పుట్టకముందే బిడ్డపై ఒక ఆధ్యాత్మిక ముద్ర పడుతుందని, దానినే ‘సంస్కారం’గా భావిస్తారని సమంత చెప్పారు. ఈ పూజా విధానం గురించి మొదట తనకు పెద్దగా తెలియదని.. కానీ కార్యక్రమం పూర్తయ్యే సమయానికి ఎంతో ఆశీర్వాదం పొందినట్టుగా, రక్షణలో ఉన్నట్టుగా అనిపించిందని ఆమె తెలిపారు.
సమంత తల్లి కావాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కొత్త అనుభూతి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉందని.. తల్లిగా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సమయంలో సమంత గర్భవతి అనే వార్తలు మొదట బయటకు వచ్చాయి. అభిమానులు ఆమె బేబీ బంప్‌ను గమనించడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సినిమా సక్సెస్ మీట్లో సమంత స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ప్రస్తుత సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం మాతృత్వ విరామం తీసుకుంటానని ఆమె వెల్లడించారు. ఇక సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులో వివాహం చేసుకున్నారు. అంతకుముందు సమంత నటుడు నాగచైతన్యను వివాహం చేసుకోగా.. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.









