
CM Revanth Reddy : 22ఏ నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రభుత్వం కావాలనే ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగడానికి కారణం.. ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదని చెప్పడమేనని అన్నారు. ముఖ్యమైన సమస్యలపై చర్చ జరగకుండా విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. 22ఏ భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భూముల సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు భూములకు సంబంధించిన సమస్యలు, 22ఏ జాబితాలో ఉన్న భూములు, కోర్టుల తీర్పులు వంటి అంశాలను పరిశీలించాలని చెప్పారు.
Also Read : రూ.3,300 కోట్ల ఆస్తులు.. ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే?
నిజాం పాలనపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి 10 నుంచి 12 ఏళ్ల కాలాన్ని పక్కన పెడితే నిజాం పాలనలో దాదాపు 200 ఏళ్ల పాటు మంచి పాలన అందించారని అన్నారు. సుమారు 60 శాతం భూములకు హద్దులు నిర్ణయించారని, మిగిలిన 40 శాతం భూములకు మాత్రం హద్దులు లేవని చెప్పారు. భూముల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు అప్పట్లో కాస్రా పహాణి విధానాన్ని తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2010లోనే ఒడిశాలో ధరణి తరహా వ్యవస్థ ప్రారంభమైందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ధరణిని తానే తీసుకొచ్చినట్లు చెప్పుకున్నారని విమర్శించారు. ఒడిశాలో అమలు చేసిన ధరణిపై కాగ్ తీవ్ర విమర్శలు చేసిందని సీఎం అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ తెలంగాణలో ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణి పేరుతో అక్రమాలకు అవకాశం కల్పించారని విమర్శించారు. ధరణి వ్యవస్థపై పూర్తి వివరాలు చెప్పాలని కేసీఆర్‌ను తాను పలుమార్లు అసెంబ్లీకి రావాలని కోరానని రేవంత్ చెప్పారు. కానీ ఆయన సభకు రాలేదన్నారు. కేసీఆర్‌కు ‘బబుల్ షూటర్’ అనే పేరు పెట్టింది ఆయన కుటుంబ సభ్యులేనని సీఎం వ్యాఖ్యానించారు. ధరణి వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్ సభకు రాలేదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉన్న భూమి రికార్డులను కలెక్టరేట్లకు తరలించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డిజిటలైజేషన్ పేరుతో రికార్డులన్నింటినీ కలెక్టరేట్లకు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడే కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం ఆ రికార్డులు పూర్తిగా ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని అన్నారు. భూదాన్ భూముల్లో కూడా ఆక్రమణలు జరిగాయని, వాటి వివరాలను కూడా బయటపెడతానని సీఎం చెప్పారు. భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలను కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. భూముల కోసం ఎర్రజెండా పార్టీలు పోరాటం చేస్తే.. పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అసైన్డ్ భూములను పేదల నుంచి ఇతరులు తీసుకోకుండా వాటి బదిలీలపై కూడా నిషేధం విధించామని చెప్పారు. పేదలు ఈరోజు భూములపై హక్కులు అనుభవిస్తున్నారంటే అందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.
ధరణి పేరుతో భారీ స్థాయిలో భూముల అక్రమాలు జరిగాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. నిషేధిత భూముల సమస్యను గత ప్రభుత్వం మరింత క్లిష్టంగా మార్చిందని విమర్శించారు. కొంతమంది వ్యక్తులు ఆక్రమించిన వేల ఎకరాల భూముల వివరాలను అసెంబ్లీ ముందుంచుతానని సీఎం చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కూడా కావాలనే తప్పుడు ప్రచారం చేశారని రేవంత్ అన్నారు. 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మంత్రిపై ఎంత ఉందో ప్రభుత్వంపై కూడా అంతే ఉందని చెప్పారు. ఈ సమస్యపై అందరూ కలిసి చర్చించి పరిష్కారం కనుగొనాలని సభ్యులను కోరారు. పేదలకు ఉపయోగపడేలా సభ్యులు మంచి సూచనలు ఇస్తే ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ప్రతిపాదనలపై కూడా సభ్యులు తమ సలహాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.
Also Read : దిశా కేసులో CBI సంచలనం.. FIR లో ఆదిత్య ఠాక్రే పేరు!









