YouTuber Vaishnavi : రాష్ట్రంలో కలకలం సృష్టించిన యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌ నెలకొంది. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును నిన్న నిజామాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన విషయం తెలిసిందే.హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఈ మేరకు సంతోష్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశాడు. తన చెల్లిని గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేశానని సంతోష్‌ ఆ వీడియోలో ఒప్పుకున్నాడు. ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం జరగకూడదని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన చెల్లి హత్యకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సంతోష్‌ స్పష్టం చేశాడు. హరిబాబును చంపడం ద్వారా తన చెల్లి మరణానికి న్యాయం చేసుకున్నానని వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించి తాను నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నానని ఆ వీడియోలో సంతోష్ తెలిపాడు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ ‘నా చెల్లెలి హత్య కేసులో ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. నేనే హరిబాబును చంపా. పోలీసులకు లొంగిపోతున్నా. నాకు శిక్ష పడకుండా ప్రజలు మద్దతు తెలిపాలి’ అని వీడియోలో పేర్కొనడం గమనార్హం.

Also Read : మిర్యాలగూడలో ట్యాంకర్‌ బీభత్సం..ఒకరు మృతి.. ఐదు కార్లు, 108 ధ్వంసం

అసలేం జరిగిందంటే…
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు(24) పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక కంపౌండర్‌గా పనిచేసేవాడు. అదే జిల్లా మాదాపూర్‌ గ్రామానికి చెందిన వైష్ణవి(19) యూట్యూబర్‌గా పనిచేస్తూ అనారోగ్య సమస్యలపై సదరు ఆసుపత్రికి వస్తుండేది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకరోజు హరిబాబు వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ మొదట దానికి ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఒప్పుకుంది. అయితే ఈ విషయం హరిబాబు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా వారిని కాదని పెళ్లి చేసుకున్నారు. మాదాపూర్‌లోని వైష్ణవి ఇంట్లోనే కాపురం పెట్టారు. ఈ క్రమంలో వైష్ణవి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే హరిబాబు తల్లిదండ్రులు హరిబాబు పై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నం వచ్చేదని వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయంలో వైష్ణవితో హరిబాబు గొడవ పడ్డాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు 5 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయినా వారి వేదింపులు ఆగలేదు. హరిబాబుకు లేనిపోనివి చెప్పి వైష్ణవిని అంతం చేసేలా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మార్చి 16న ఇద్దరి మధ్య గొడవ జరగగా ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తితో ఆమెను పొట్టలో పొడిచి హత్య చేసి పారిపోయాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో హరిబాబు, అతడి తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలూ జైలుపాలయ్యారు.

Also Read : కాంగ్రెస్‌ నేతలకు బిగ్‌షాక్‌..మహేష్ గౌడ్, అద్దంకిలపై హరీశ్ రావు పరువునష్టం దావా

13 మంది సోదరులు
కాగా వైష్ణవి హత్య విషయంలో ఆమె తల్లిదండ్రులు, సోదరులు కుమిలిపోయారు. వైష్ణవి తల్లికి మొత్తం ఆరుగురు అక్కాచెల్లెళ్లు. వైష్ణవికి ఇద్దరు సొంత అన్నలు ఉండగా. వీరితో పాటు చిన్నమ్మలు, పెద్దమ్మల కుమారులు మొత్తం 13 మంది అన్నదమ్ములున్నారు. అన్ని కుటుంబాల్లో వైష్ణవి ఒక్కతే ఆడపిల్ల కావడం, అందరికన్నా చిన్నది కావడంతో వారందరికీ ఆమె అంటే ఇష్టం. ఎంతో గారాబంగా చూసుకునే సోదరి హత్యకు గురి కావడం సోదరులు జీర్ణించుకోలేకపోయారు. హంతకుడు హరిబాబును కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. లేదంటే తామే చంపేస్తామని ప్రతినబూనడం సామాజిక మాధ్యమాల్లో ఆనాడు చర్చకుదారితీసింది.

ఈ క్రమంలో హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్న కంకులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతన్ని కొంతకాలంగా అనుసరిస్తున్న వైష్ణవి సోదరుడు సంతోష్‌ గురువారం సాయంత్రం కత్తితో నడిరోడ్డుపై నరికి చంపాడు. అనంతరం హరిబాబును తానే చంపానని సంతోష్‌ వీడియో విడుదలచేయడంతో రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.