Road Accident : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్యాంకర్‌ అర్థరాత్రి తీవ్ర బీభత్సం సృష్టించింది. వరుసగా ఐదు కార్లు, ఒక అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : వైష్ణవి అన్నలు నన్నూ చంపేస్తారు… హరిబాబు తల్లి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (36) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు.ఈ క్రమంలో మిర్యాలగూడ సమీపానికి రాగానే నందిపాడు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి కింద పడిపోయిన స్థితిలో కనిపించాడు. దీంతో మానవత్వంతో అతడికి సహాయం అందించేందుకు శ్రీనివాసరావు తన కారును రోడ్డు పక్కన ఆపి 108కు కాల్‌ చేశాడు.

దీంతో 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత శ్రీనివాస రావు సిబ్బందితో కలిసి బాధితుడిని అందులో ఎక్కిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్‌ ట్యాంకర్‌ వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదుపుతప్పిన ట్యాంకర్‌ అంబులెన్స్‌ సహా మొత్తం ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, అంబులెన్స్ మధ్యలో శ్రీనివాసరావు ఇరుక్కుపోయి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ సిబ్బందికి చెందిన స్వప్న అనే యువతి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఇతర వాహనాల్లో ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. అందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read : యూట్యూబర్‌ వైష్ణవి మర్డర్ కేసులో సంచలనం.. భర్త హరిబాబు దారుణ హత్య

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.