Pakistan :  పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు జరిగింది. కోహాట్‌ పోలీస్‌ లైన్స్‌లో ఉన్న ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మసీదులో కొంత భాగం కూలిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ 1122 బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. తొలుత పేలుడు ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో జరిగినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు.

Also Read : విమానంలోనే బాగా తన్నుకున్నారు.. చినిగిన టీషర్ట్ : వీడియో వైరల్!

అయితే ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ జుల్ఫికర్ హమీద్ ప్రకారం.. పేలుడు పోలీస్ లైన్స్ కాంప్లెక్స్‌లోని మసీదులోనే జరిగింది. పేలుడు తర్వాత సాయుధ ఉగ్రవాదులతో కాల్పులు కూడా జరిగినట్లు ఐజీ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, గవర్నర్ ఫైసల్ కరీమ్ కుండీ తీవ్రంగా ఖండించారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. శిథిలాల నుంచి గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీసి అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలపై గతంలో వరుస దాడులకు పాల్పడిన TTPపై అనుమానాలు ఉన్నాయి.

Also Read : జిన్‌పింగ్‌కు బ్రెయిన్‌స్ట్రోక్‌ ? కోమాలో చైనా అధ్యక్షుడు?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.