
US Attack On Chinese Ship : అమెరికా సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని గుడ్డిగా నమ్మడం వల్ల ప్రపంచంలో దాదాపు ఒక పెద్ద యుద్దమే మొదలయ్యేది. ఏఐ ఇచ్చిన ఒక తప్పుడు నివేదిక చూసి.. చైనా నౌకపై దాడి చేయడానికి అమెరికా మిలటరీ సర్వసిద్ధమైంది. అయితే ఆఖరి క్షణంలో అసలు విషయం బయటపడటంతో ఒక భారీ విపత్తు తృటిలో తప్పిపోయింది.
ఈ ఏడాది ఆరంభంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సముద్రంలో పయనిస్తున్న ఒక చైనా ఓడలో అణ్వాయుధాలకు సంబంధించిన విడిభాగాలు ఉన్నాయని, అది ఇరాన్ వైపు వెళ్తోందని అమెరికా సైన్యానికి ఒక సంచలనాత్మక గూఢచారి నివేదిక అందింది. ఈ సమాచారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అమెరికా సైన్యం, ఆ చైనా నౌకను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టింది. సాయుధ బలగాలు ఓడలోకి ప్రవేశించడానికి సిద్ధమవ్వగా, మిలటరీ విమానాలు కూడా గగనతలంలో మోహరించాయి.
Also Read : డెంగ్యూకి చెక్.. త్వరలోనే భారత్‌లోకి క్యూడెంగా వ్యాక్సిన్.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆపరేషన్ ప్రారంభమయ్యే సరిగ్గా ముందస్తు క్షణాల్లో అమెరికా ఉన్నతాధికారులు ఆ నివేదికను మళ్లీ పరిశీలించారు. ఈ క్రమంలోనే అసలు నిజం బయటపడింది. ఆ నివేదికను మానవులు తయారు చేయలేదని.. విశ్లేషకులు తయారు చేయలేదని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ సాయంతో రూపొందించారని కనుగొన్నారు.
సదరు ఏఐ సాధనం బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని రహస్య గూఢచార డేటాతో కలిపి విశ్లేషించే క్రమంలో తీవ్ర తప్పుగా అర్థం చేసుకుంది. ఓడలోని సాధారణ సరుకును అణ్వాయుధ పరికరాలుగా తప్పుడు అంచనా వేసింది. విశ్లేషకులు దీనిని సరిగా తనిఖీ చేయకుండానే ప్రామాణిక గూఢచారి నివేదికగా మార్చి ఉన్నతాధికారులకు పంపేశారు. నివేదిక పూర్తిగా అబద్ధం అని తేలడంతో సైన్యం తన ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేసింది.
ప్రస్తుతం చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాల కంటే రేసులో ముందుండటానికి అమెరికా సైన్యం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. సమాచారాన్ని విశ్లేషించడం, శత్రువుల లక్ష్యాలను గుర్తించడం వంటి పనులను ఏఐకి అప్పగిస్తున్నారు. హవాయిలోని ‘యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పసిఫిక్’ సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ తప్పుడు నివేదిక తయారైంది.
అయితే సైనిక విభాగాల్లో వాడే అనేక అంతర్గత ఏఐ సాధనాలు సాధారణ కమర్షియల్ ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. సరైన మానవ పరిశీలన, తనిఖీలు లేకుండా ఏఐ ఇచ్చే డేటాను గుడ్డిగా నమ్మితే, భవిష్యత్తులో దేశాల మధ్య అనవసరమైన యుద్ధాలు వచ్చి కోలుకోలేని నష్టం జరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. ఏఐ వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని ప్రపంచ దేశాలకు ఇది ఒక హెచ్చరికగా నిలిచింది.
Also Read : ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. వైట్‌హౌస్ నుంచి ఈ న్యూస్ ఛానెళ్లపై బ్యాన్.. ఎందుకో తెలుసా?









