donald Trump

US Shock To India : ప్రపంచ వాణిజ్య రంగంలో తీవ్ర కలకలం రేపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనాత్మక చట్టంపై సంతకం చేశారు. రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లను ఒకేసారి దెబ్బతీసేలా రూపొందించిన ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026’ బిల్లుపై ఆయన దస్కత్ చేశారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్ ఇప్పటికే ఈ బిల్లుకు భారీ మెజారిటీతో ఆమోదం తెలిపాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం పూర్తికావడంతో ఇది అధికారికంగా కఠినమైన చట్టంగా రూపాంతరం చెందింది. ఈ కొత్త చట్టం వల్ల రష్యా, ఇరాన్‌లపై నేరుగా ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశాలతో వ్యాపారం చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 100 శాతం వరకు పన్నులు పెంచే సర్వాధికారాలు అమెరికా అధ్యక్షుడి చేతికి వచ్చాయి.

Also Read : విమానంలోనే బాగా తన్నుకున్నారు.. చినిగిన టీషర్ట్ : వీడియో వైరల్!

ఈ చట్టం తీసుకురావడం వెనుక అమెరికాకు ఒక బలమైన వ్యూహం ఉంది. రష్యాపై ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి భారీగా తక్కువ ధరకు ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా నిలబడగలుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలంటే ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావించింది. అందులో భాగంగానే భారత్, చైనాతో పాటు మరో 8 దేశాలను కూడా ఈ కొత్త ఆంక్షల పరిధిలోకి చేర్చారు.

ఈ నూతన చట్టం ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అపరిమితమైన అధికారాలు లభించాయి. రష్యా అగ్ర నాయకత్వంపై వారి కీలకమైన ఇంధన రంగంపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం దక్కింది. అలాగే విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య చమురు నౌకల వ్యాపారాన్ని అడ్డుకునే అధికారం లభించింది. అన్నింటికంటే ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని ఒత్తిడి తెస్తూ, మాట వినని భారత్, చైనాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీగా సుంకాల మోత మోగించే పవర్స్ ట్రంప్‌కు వచ్చాయి. దీనివల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతుల ధరలు రెట్టింపై ఇండియన్ వ్యాపారాలపై నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.

అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై భారత ప్రభుత్వం చాలా ఘాటుగా స్పందించింది. రష్యా నుంచి తమ ఇంధన అవసరాల కోసం చమురు కొనుగోలు చేయడం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని భారత్ స్పష్టం చేసింది. రష్యాపై ఆంక్షల పేరుతో భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై అనవసరంగా పన్నులు పెంచితే, అమెరికాతో దశాబ్దాలుగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార బంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు చైనా కూడా ఈ చట్టంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేకుండా అమెరికా సొంతంగా తీసుకునే ఏకపక్ష ఆంక్షలను, బెదిరింపులను తాము ఎంతమాత్రమూ అంగీకరించబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెగేసి చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా ఈ రకంగా ఇతర దేశాల వాణిజ్యంపై దాడి చేయడం సరికాదని మండిపడ్డారు.

Also Read : భారత్‌పై నూరుశాతం సుంకాలు… రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల బిల్లుకు ఆమోదం..