సౌదీ అరేబియాలోని కీలకమైన తూర్పు-పశ్చిమ పైప్‌లైన్‌పై ఇటీవల దాడులు(East-West Pipeline Attack) జరగడంతో ఆ దేశ చమురు నెట్‌వర్క్ తీవ్ర ఒత్తిడికి గురైంది. రాజ్యంలోని తూర్పు చమురు క్షేత్రాల నుంచి ఎర్ర సముద్ర తీరంలో ఉన్న యాన్బు ఎగుమతి కేంద్రానికి ముడి చమురును చేరవేసే ఈ పైప్‌లైన్ సెప్టెంబర్ 10 నుంచి పనిచేయడం లేదు. ఈ అంతరాయం కారణంగా సౌదీ జాతీయ చమురు సంస్థ అరామ్కో భారతీయ రిఫైనరీలకు చేసే సాధారణ ముడి చమురు సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రభావం కేవలం భారత్‌పైనే కాకుండా ఐరోపా వినియోగదారులపై కూడా పడింది. అయితే భారత్‌కు చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోలేదు. గల్ఫ్‌లోని రాస్ తానూరా నుంచి ఒమన్‌లోని సోహార్ వద్ద నౌకల మధ్య బదిలీ ద్వారా స్పాట్ కార్గోల ద్వారా సౌదీ చమురు భారత్‌కు చేరుతోంది. కాకపోతే, ప్రత్యామ్నాయ మార్గాల వల్ల రవాణా ఖర్చులు పెరిగి భారత రిఫైనరీలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

Also Read : భారతీయ టెకీలకు బిగ్ షాక్.. H-1B వీసా బాంబ్.. అమెరికా డ్రీమ్‌కి మళ్లీ ఆటంకమే!

సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం సౌదీ రక్షణ కోసం సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రతను, పవిత్ర పుణ్యక్షేత్రాలను కాపాడేందుకు తమ నిబద్ధత షరతులు లేనిది అని.. దీనికోసం ఎంతకైనా వెళ్తామని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పష్టం చేశారు. ఆగస్టు 7న సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఆధారంగానే పాక్ ఈ శపథం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా అది మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. యెమెన్‌లోని హౌతీలతో ఘర్షణ తీవ్రమైతే సౌదీకి ఆచరణాత్మకంగా, దౌత్యపరంగా అండగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ప్రకటించారు.

భారత్‌కు సౌదీ చమురు తగ్గడం, అదే సమయంలో పాకిస్తాన్ సౌదీకి సైనిక మద్దతు ప్రకటించడం వెనుక ఏదైనా అంతర్గత సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత్‌కు వెళ్లే చమురును పాకిస్తాన్‌కు మళ్లించడం కోసమే సౌదీ ఈ నిర్ణయం తీసుకుందా అనే ప్రచారం కూడా జరిగింది. అయితే లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం ఈ రెండింటికీ ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. భారతీయ రిఫైనరీలకు సరఫరా తగ్గడానికి ప్రధాన కారణం పైప్‌లైన్‌కు జరిగిన భౌతిక నష్టమే తప్ప రాజకీయ వ్యూహం కాదు. పైప్‌లైన్ దెబ్బతినడం వల్లే యూరోపియన్ దేశాలకు కూడా సరఫరాలు ఆలస్యమయ్యాయి.

పాకిస్తాన్‌తో సౌదీకి ఉన్న ఇంధన ఒప్పందాలు చాలా పాతవి. 2026 ప్రారంభంలోనే హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్ ఇంధన సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు, యాన్బు ద్వారా సరఫరా చేస్తామని సౌదీ హామీ ఇచ్చింది. ఆ ఏర్పాట్లు ప్రస్తుత పైప్‌లైన్ ప్రమాదానికి ముందే జరిగాయి. అలాగే రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఇప్పటికప్పుడు కొత్తగా తన సైన్యాన్ని సౌదీ యుద్ధ క్షేత్రంలోకి దింపడం లేదు. శిక్షణ, లాజిస్టిక్స్ కోసం మాత్రమే ఇప్పటికే కొద్దిమంది పాక్ సైనికులు అక్కడ ఉన్నారు.

Also Read : డెంగ్యూ డేంజర్‌కు ఎండ్ కార్డ్.. 2027లో భారత్‌లోకి రాబోతున్న సైలెంట్ కిల్లర్ వ్యాక్సిన్ క్యూడెంగా!