Mamata Banerjee :  వెస్ట్ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రీజినగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ వర్గం తరఫున పోటీ చేస్తున్న రబియుల్ అలం చౌదరి ఉదయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ పోటీలో ఉంటానని చెప్పారు.

మీడియాతో మాట్లాడిన రబియుల్ అలం చౌదరి.. తమ పార్టీకి ప్రస్తుతం అధికారిక ఎన్నికల గుర్తు లేకపోవడం, పార్టీ కార్యకర్తలపై ఒత్తిడి ఉండటం వంటి కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన గుర్తును తక్కువ సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా కష్టంగా ఉందని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు కూడా ఒత్తిడిలో ఉన్నారని, చాలా మంది పనుల కోసం ప్రాంతం నుంచి వెళ్లిపోయారని రబియుల్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తల సహకారం లేకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని ఆయన ప్రశ్నించారు. దీంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉదయం ప్రకటించారు.

Also Read : ఫిబ్రవరిలో ఖైరతాబాద్ బైఎలక్షన్!

అయితే మధ్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది. మమతా బెనర్జీ వర్గానికి చెందిన సీనియర్ నేతలను కలిసిన తర్వాత రబియుల్ అలం చౌదరి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మమతా బెనర్జీ సూచనతోనే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. మమతా బెనర్జీ తనతో మాట్లాడిన తర్వాత మరోసారి ఆలోచించానని, ఆమె సూచన మేరకు నామినేషన్ ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎన్నికల బరిలో కొనసాగుతున్నానని రబియుల్ చెప్పారు. రీజినగర్‌తో పాటు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనుంది.

ఇక నందిగ్రామ్‌లోనూ మమతా బెనర్జీ వర్గానికి ఇదే తరహాలో అనూహ్య పరిణామం ఎదురైంది. ఆ వర్గం అభ్యర్థి సంచితా ప్రధాన్ దే శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిశారు. ఆ తర్వాతే ఆమె ఎన్నికల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మిలన్ ప్రధాన్‌ను 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… ధరలు పెరడగానికి అసలు కారణం ఏంటంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.