
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై తమ దాడులను తీవ్రతరం చేశారు. తాజాగా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల వల్ల అక్కడ భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
సౌదీ అరేబియాలో మీడియాపై కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నందున అక్కడ జరిగిన నష్టం, ఇతర వివరాలు వెంటనే బయటకు రాలేకపోతున్నాయి. అయితే ఆ విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హూతీలు దాడులను తీవ్రతరం చేయడాన్ని భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు ప్రాంతీయ వివాదాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ సముద్రయానం, వాణిజ్య భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయని హెచ్చరించింది. అంతేకాకుండా హూతీలకు ఆయుధాలు అందకుండా గతంలో విధించిన నిషేధాన్ని ప్రపంచ దేశాలన్నీ కచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది.
మరోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలు జరిపేందుకు కొన్ని ముందస్తు షరతులను విధించినట్లు తెలిపింది. ఈ షరతుల వివరాలను ఖతార్ దేశం ద్వారా అమెరికా ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి అధినేత మొహిసిన్ రెజాయి మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చే స్పందన కోసం వేచి చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.









