Donald Trump
Donald Trump

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం అమెరికాకు కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. తమతో దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలంటే అమెరికా తప్పనిసరిగా ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మోహ్‌సేన్ రెజాయ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా అమెరికాకు సందేశాన్ని పంపారు.

అమెరికా తనకు తానుగా సృష్టించుకున్న ఊబి నుంచి బయటపడాలన్నా, అందులో మరింత కూరుకుపోకుండా ఉండాలన్నా ఇరాన్ హక్కులను, షరతులను అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అయితే ఆ ఏడు షరతులు ఏంటనే వివరాలను బయటపెట్టలేదు. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా అమెరికాకు ఐక్యరాజ్యసమితి నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇరుదేశాల వివాదంపై విచారణ జరిపిన యూఎన్ ఫాక్ట్-ఫైండింగ్ మిషన్ ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో ఇరాన్‌పై అమెరికా జరిపిన రెండు ప్రధాన వైమానిక దాడులు యుద్ధ నేరాల కిందకే వస్తాయని ఈ నివేదిక ప్రాథమికంగా నిర్ధారించింది. అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి అమెరికా సైన్యం ఈ దాడులు చేసిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఎత్తిచూపింది.

మినాబ్‌లోని ‘షజారే తయ్యెబే ప్రాథమిక పాఠశాల’పై అమెరికా బలగాలు విచక్షణారహితంగా దాడి చేశాయి. అది కేవలం పౌరులకు చెందిన పాఠశాల అని అక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు జరగడం లేదని తెలిసినప్పటికీ దాడి చేశారు. ఈ ఘటనలో 120 మందికి పైగా చిన్న పిల్లలతో కలిపి మొత్తం 150 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.లామెర్డ్‌లోని ఒక క్రీడా కేంద్రంపై జరిగిన దాడి వల్ల చుట్టుపక్కల నివాసాలు, మరొక పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో 22 మంది పౌరులు మరణించడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా కచ్చితంగా యుద్ధ నేరమేనని యూఎన్ కమిటీ పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలను అమెరికా అధికారిక నివాసం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. యూఎన్ మానవ హక్కుల మండలి పనితీరునే వైట్‌హౌస్ అధికార ప్రతినిధి అన్నా కెల్లీ తప్పుబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలలో ఇరాన్ మాత్రమే యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అమెరికా కాదని తిరిగి ఆరోపించారు. ఒకవైపు ఐక్యరాజ్యసమితి యుద్ధ నేరాల నివేదిక, మరోవైపు ఇరాన్ విధించిన 7 షరతులతో అమెరికా ఇప్పుడు తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.