
భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు, ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం తీర్చిదిద్దిన పొదుపు పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY). ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ‘బేటి బచావో, బేటి పడావో’ ప్రచారంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం భారీ నిధిని నిర్మించుకోవచ్చు. ఇటీవల హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు, డిపాజిట్ నిబంధనల గురించి వివరాలను వెల్లడించారు.
ఈ పథకంలో చేరడానికి 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఆడపిల్లలు మాత్రమే అర్హులు. ఒక బాలిక పేరు మీద ఒక ఖాతా మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల వరకు ఈ పథకం కింద ఖాతాలు తెరిచే వెసులుబాటు ఉంది. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస పెట్టుబడిగా రూ.250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి వరుసగా 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి మెచ్యూరిటీ మొత్తం చేతికి అందుతుంది.
ప్రస్తుతం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందజేస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం నెలకు రూ. 4,166 పొదుపు చేస్తే 15 ఏళ్లలో మీరు చెల్లించే మొత్తం రూ. 7.50 లక్షలు అవుతుంది. 21 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యాక వడ్డీతో కలిపి దాదాపు రూ. 23.93 లక్షలు లభిస్తాయి. అదే ఒక పాప పేరు మీద ఏడాదికి గరిష్ట పరిమితి అయిన రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేస్తే, 21 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ. 70 లక్షలు పొందే అవకాశం ఉంది. ఒకవేళ ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండి, వారిద్దరి పేరు మీద ఏడాదికి రూ. 1.5 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి కలిపి దాదాపు రూ.1.4 కోట్ల భారీ నిధి అందుతుంది.
ఈ పథకంలో జమ చేసే మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు లభించడమే కాకుండా వచ్చే మెచ్యూరిటీ మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సంవత్సరం కనీస మొత్తం జమ చేయడంలో విఫలమైతే రూ. 50 జరిమానా చెల్లించి ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. బాలిక జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు, చిరునామా రుజువులతో సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా గుర్తింపు పొందిన వాణిజ్య బ్యాంకుల్లో సులభంగా ఈ ఖాతాను తెరవవచ్చు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఈ ఖాతా తెరిస్తే వారికి 21 ఏళ్లు వచ్చేసరికి ఆర్థికంగా మద్దతు లభిస్తుంది.









