Banks closed for 5 consecutive days
Banks closed for 5 consecutive days

మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా దేశంలోని ప్రధాన బ్యాంకుల ఖాతాదారులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల చివర్లో ఏకంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి తోడు సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం కావడంతో సాధారణ బ్యాంకు సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో ఐదు రోజులు సెలవులు కానున్నాయి.

ఈ పరిణామాలపై దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను ముందస్తుగా అప్రమత్తం చేసింది. సమ్మె సమయంలో సాధారణ కార్యకలాపాలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ పనులు ఉన్నవారు సెప్టెంబర్ 25 నాటికే పూర్తి చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్, పెండింగ్ పత్రాల సమర్పణ, కాగితపు చెక్కుల ప్రాసెసింగ్, లేదా సిబ్బంది ప్రత్యక్ష సంతకం, ముద్ర అవసరమయ్యే ఖాతా సేవల కోసం వేచి చూడకుండా వెంటనే తమ శాఖలను సందర్శించి పనులు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల భాగస్వామ్యాన్ని బట్టి శాఖల్లో సేవలు పాక్షికంగా లేదా పూర్తిగా నిలిచిపోవచ్చు.

వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు యూనియన్లు చేపట్టిన నిరసన ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల సెప్టెంబర్ 11న యూఎఫ్ బ్యూ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన తెలియజేసిన ఉద్యోగులు, ఇప్పుడు మూడు రోజుల సమ్మెకు సిద్ధమయ్యారు. ఒకవేళ తమ సమస్యలు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కూడా యూనియన్లు స్పష్టం చేశాయి.

సమ్మె సమయంలో వినియోగదారులకు వీలైనంత వరకు అసౌకర్యం కలగకుండా డిజిటల్ సేవలపై ఆధారపడాలని ఎస్‌బీఐ సలహా ఇచ్చింది. నగదు విత్‌డ్రా, డిపాజిట్ అవసరాల కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లను ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా సేవలు పొందవచ్చు. అలాగే సాధారణ లావాదేవీలు, నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది.