Kalvakuntla Kavitha :తనను కాంగ్రెస్‌ విడిచిన బాణమని బీఆర్‌ఎస్‌ వాళ్లు.. కేసీఆర్‌ వదిలిన బాణమని రేవంత్‌రెడ్డి, మరికొందరు బీజేపీ బాణమని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరో విడిచిన బాణాన్ని కాదు. అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత పాల్గొని మాట్లాడారు. తను ఎవరు వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ యువజనుల యుద్ధ నినాదాన్ని.. అంబేడ్కర్‌ వాదాన్ని.. మహాత్మ జ్యోతిబా పులే ఆత్మగౌరవ నినాదాన్ని నేను అంటూ నినదించారు.

రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయని, రాజకీయాలంటే కేవలం బూతులు తిట్టుకోవడమే అన్నట్లుగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అధర్మం పెరిగి, పాలకుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి ధర్మపోరాటానికి సిద్ధం కావాలని చెప్పాడని కవిత అన్నారు. నేడు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అందుకే తెలంగాణ రక్షణ సేన కోస్గి వేదికగా పాంచజన్యం సభతో ధర్మ యుద్ధానికి దిగుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటైందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని కవిత తీవ్రంగా హెచ్చరించారు.

మహిళలు మహరాణులు అంటారు. కానీ, వంటింట్లో గిన్నెల మీద మగవాళ్ల పేర్లే ఉంటాయని ఆమె గుర్తు చేశారు. దేశంలో 29 రాష్ట్రాలున్నా ఒక్క రాష్ట్రానికి మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉందన్నారు. ఈ చరిత్రను తిరగరాద్దామా? తెలంగాణలో మాతృస్వామ్య వ్యవస్థ తెచ్చుకుందామా? అంటూ ఆమె సభకు వచ్చిన మహిళలను ఉద్ధేశించి ప్రశ్నించారు. ఈ జిల్లాకు చెందిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారని, అలాంటిది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యత రేటు అఫ్గానిస్థాన్‌తో సమానంగా ఉందని ఎద్దేవా చేశారు.. దీనికి సీఎం ప్రజలకు ఏం సమాధానం చెబుతారు’’ అని కవిత ప్రశ్నించారు.

తెలంగాణ రైతులు సాగునీరు లేక అవస్థలు పడుతుంటే రైతులకు నీళ్లిచ్చే ఆలోచన రేవంత్‌ రెడ్డికి లేదని కవిత ఆరోపించారు. నీళ్లు, యూరియా, ధాన్యం కోసం రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటికి నిన్న పాలమూరు రైతులు జూరాల హెడ్ రెగ్యూలేటర్‌ను పగులగొట్టి మరీ నీళ్లు విడుదల చేసుకోవాల్సి వచ్చిందని కవిత గుర్తుచేశారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యల తెలంగాణ కావాలా అని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై తెలంగాణ రక్షణ సేనను ఆశీర్వదిస్తే, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తామని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.