Shobha Reddy : ఔట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ రంగంలో చట్టబద్ధమైన అవకాశం కోసం గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఒక మహిళా వ్యాపార వేత్తకు చేదు అనుభవం ఎదురైంది. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెకు ప్రభుత్వ పెద్దల నుంచి అనుచిత ఆహ్వానం ఎదురైంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి ఏకంగా ఆమెను గెస్ట్‌హౌజ్‌కు రమ్మనడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సదరు వ్యాపార వేత్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…

ఔట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ రంగంలో చట్టబద్ధమైన వ్యాపార అవకాశం గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్న మిథునా యాడ్స్‌ ప్రొప్రైటర్‌ కె. శోభారెడ్డి సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ తీవ్ర చర్చనీయంశంగా మారింది. తన సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన సమయంలో తనకు సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి నుంచి అనుచిత ప్రతిపాదన ఎదురైందని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఆయన తనను ఆయన గెస్ట్‌హౌ్‌సకు రావాలని కోరారంటూ కె.శోభారెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని శోభారెడ్డి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అంతేకాక ఆమె సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఔట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ రంగంలో గత మూడేళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కోరుతున్నట్లు ఆమె వివరించారు. అయితే విషయంలో తనకు గత మూడేళ్లగా అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. అది అలా ఉన్నా రెగ్యులర్‌ టెండర్లు పిలిచే వరకు రెవెన్యూ షేరింగ్‌ విధానంలో తాత్కాలిక అవకాశమివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పట్టించుకునేవారే లేరని శోభారెడ్డి నిరాశ వ్యక్తం చేశారు.

Also Read : హైదరాబాద్‌ – ఖమ్మం నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం..కారులో డాక్టర్‌ సజీవదహనం

నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు అందుకున్నప్పటికీ కొన్ని ప్రకటనల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు, మరికొన్ని పైలట్‌ ప్రాజెక్టులకు జీవో నంబర్‌ 68 కింద మినహాయింపులు, సడలింపులిచ్చారని ఆమె పేర్కొన్నారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ చేదు అనుభవం ఎదురైందని ఆమె ఆవేదన చెందారు… అయితే ఆ వ్యక్తి ఎవరు? సీఎం తో ఆయనకు ఉన్న సన్నిహిత్యం ఎలాంటిది? ఆయన పేరు ఏంటీ? ఆయనను సంప్రదించాలని చెప్పిందేవరు అనే విషయాలను శోభారెడ్డి వెల్లడించలేదు. జరిగిన విషయంపై బహిరంగ వేదికలపై ఆరోపణలు చేసేందుకు తాను ఇష్టపడటం లేదని శోభారెడ్డి తేల్చి చెప్పారు. మహిళా వ్యాపారవేత్తగా తనకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు కోరుకోవడం లేదని.. చట్టబద్ధమైన అవకాశం, సమానమైన ఆదరణ, గౌరవం మాత్రమే ఇవ్వాలంటున్నానని ఆమె తేల్చి చెప్పారు. కాగా, తను పెట్టిన పోస్టును సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తదితరుల ఖాతాలకు వ్యాపార వేత్త శోభారెడ్డి ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారడంతో ప్రభుత్వ వర్గాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.

Also Read : వైష్ణవి అన్నలు నన్నూ చంపేస్తారు… హరిబాబు తల్లి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.