
Kokapet Neopolis : నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను అమ్మి ఆధాయం సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వానికి కోకాపేట వేలంలో చుక్కెదురైంది. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో ఉన్న ప్లాట్ నంబరు 17లోని భూమి వేలానికి వేయగా దాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం మళ్లీ మొదటికి వచ్చింది. రూ.వందల కోట్ల విలువైన 4.59 ఎకరాల భూమికి గాను హెచ్ఎండీఏ తాజాగా వేలం వేసింది. అయితే దీనికోసం కేవలం సింగిల్ బిడ్ మాత్రమే వచ్చింది. దీంతో హెచ్ఎండీఏ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బహుళ అవసరాల జోన్ కింద ఉన్న ఈ లేఅవుట్లో ఇప్పటికే 60 అంతస్తుల భారీ వాణిజ్య, నివాస, వ్యాపార భవనాలు నిర్మాణమవుతున్నాయి. తొలిసారి వేలం వేసిన సందర్భంగా ఇక్కడ ఎకరం రూ.వంద కోట్లు దాటి రికార్డు సృష్టించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన భూమికి భారీ ధర పలుకుతుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవల నిర్వహించిన వేలం పాటలో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు అయింది. దీంతో హెచ్ఎండీఏ పునరాలోచనలో పడింది. అయితే హెఎండీఏ ఎకరం కనీస ధర రూ.120 కోట్లు నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. ముందే భారీ మొత్తంలో కనీస ధర పెట్టడం… దరావత్తు రూ.5 కోట్లు చెల్లించాలని చెప్పడం మూలంగా చాలామంది వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో ఈ భూమి వేలానికి నోచుకోవడం లేదు.
Also Read : టార్గెట్ కేటీఆర్, హరీశ్‌రావు.. సిరిసిల్ల, సిద్ధిపేటల్లో కాంగ్రెస్ సభలు ?
త్వరలో మళ్లీ వేలం..
ఇదిలా ఉండగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో మరో విడత ప్లాట్ల వేలానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది. లేమూరు, ఇన్ముల్నెర్వ, బాచుపల్లి, మోకిలల్లో మిగిలిన ప్లాట్లను వేలం వేయడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇన్ముల్‌నెర్వలో ఇటీవల వేలానికి మంచి స్పందన వచ్చింది. దీంతో అన్ని లేఅవుట్లతో కలిపి నియోపోలీస్ 4.59 ఎకరాలకు మరోసారి వేలం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.
Also Read : రేవంత్ రెడ్డికి షాక్.. మహిళను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్న సీఎం సన్నిహితుడు ?









