PTI Long March : పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు, ఇతర నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ PTI ఆధీనంలోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన మంత్రి ఫజల్ షకూర్ ఖాన్‌ను ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని PTI ప్రకటించిన కొద్ది సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. PTI తెలిపిన ప్రకారం, ఆయన కారును అడ్డుకుని, దాని టైర్లపై కాల్పులు జరిపారు. అనంతరం ఆయనను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.

మరోవైపు, అందుబాటులో ఉన్న మరో సమాచారం ప్రకారం, ఈ ఘర్షణకు కారణం మంత్రి భద్రతా సిబ్బంది అని తెలుస్తోంది. వారు పోలీసుల తనిఖీని అడ్డుకోవడానికి ప్రయత్నించడమే దీనికి కారణమని చెప్తున్నారు, ఈ క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న PTI ఇస్లామాబాద్ వరకు చేపట్టనున్న లాంగ్ మార్చ్‌కు కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్టుతో పాటు పార్టీపై పెద్ద ఎత్తున చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఈ ఘటనల కారణంగా ప్రావిన్స్‌ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా సమాచార మంత్రి షఫీ జాన్ ఈ చర్యలను రాజ్యాంగం, చట్టం, ప్రజల తీర్పుపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.

Also Read : చంద్రుడు మాదే.. ట్రంప్ సంచలన కామెంట్స్‌.. అమెరికా చట్టం ఏం చెబుతోంది?

ఫజల్ షకూర్ ఖాన్ కిడ్నాప్

ఆయుధాలు ధరించిన ముసుగులు వేసుకున్న వ్యక్తులు పెషావర్ మోటర్‌వే టోల్ ప్లాజా సమీపంలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా మంత్రి ఫజల్ షకూర్ ఖాన్ కారును అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న వీడియో ఫుటేజీలో గుర్తుతెలియని ముసుగులు ధరించిన వ్యక్తులు ప్రధాన రహదారిని మూసివేయడానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో మంత్రి కారును ప్రావిన్షియల్ అసెంబ్లీ, పెషావర్ హైకోర్టు ఎదుట ఆపేందుకు నేరుగా కారు టైర్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో మలకండ్‌లో PTI కీలక నాయకుడు, ప్రావిన్షియల్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ను కూడా అపహరించేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ వార్త వెలువడిన తర్వాత మలకండ్‌లో ఆగ్రహం వ్యక్తమైంది. పెద్ద సంఖ్యలో PTI కార్యకర్తలు బట్ ఖేలా బైపాస్‌ను దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. నిరసనకారులు టైర్లను తగలబెట్టి, నినాదాలు చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇకపై సహించబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ప్రజల చేత ఎన్నికైన నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తూ PTI అగ్రనేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ మంత్రులపై వేధింపులు, అపహారణలు వెంటనే ఆపకపోతే ప్రావిన్స్‌ వ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తామని పార్టీ కార్యకర్తలు ప్రకటించారు.

Also Read : రేపు అమెరికాకు జిన్‌పింగ్‌… విమానశ్రయానికి ట్రంప్‌ ?

ఆసుపత్రులకు ఆదేశాలు

మరోవైపు, డ్రాప్ సైట్ న్యూస్ ప్రకారం, ఇస్లామాబాద్‌లో PTI లాంగ్ మార్చ్‌కు ముందు ప్రభుత్వం ఆసుపత్రులకు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ముందు మందు ఎదురయ్యే మానవతా సంక్షోభం, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడే పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆసుపత్రులను ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల ప్రకారం, అత్యవసరం కాని శస్త్రచికిత్సలను (ఎలెక్టివ్ సర్జరీలు) వాయిదా వేస్తున్నారు. సిబ్బంది సెలవులను రద్దు చేసి, ఉద్యోగులను తిరిగి విధులకు పిలిపించారు. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ చేసేందుకు కోలుకున్న రోగులను డిశ్చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే, ఆసుపత్రులు గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్న సమయంలో, ఆ బెడ్లపై చేరే అవకాశం ఉన్న వ్యక్తులు ఇస్లామాబాద్‌కు చేరుకోకుండా ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులను 30 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. PTI నాయకులు, కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. పలుచోట్ల రహదారులను దిగ్బంధిస్తున్నారు. ఈ మార్చ్‌ను సాధ్యమైన అన్ని మార్గాల్లో అడ్డుకుంటామని పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ తెలిపారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.