Malaysia : మలేషియాకు వెళ్లే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. 30 రోజుల వీసా లేకుండా మలేషియాలోకి వెళ్లే సదుపాయాన్ని ఉద్యోగం కోసం ఉపయోగించుకోవద్దని సూచించింది. కొంతమంది ఏజెంట్లు మలేషియాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారతీయులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి మాటలు నమ్మి మలేషియా వెళ్లి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరించారు.

కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేసింది. ఇటీవల టూరిస్ట్‌ల కోసం ఉన్న 30 రోజుల వీసా ఫ్రీ సదుపాయంతో మలేషియాకు వెళ్లి ఉద్యోగాలు వెతుకుతున్న భారతీయుల సంఖ్య పెరిగిందని తెలిపింది. కొంతమంది మోసపూరిత ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని మలేషియాకు పంపిస్తున్నట్లు పేర్కొంది.

అయితే మలేషియాలో భారతీయులకు లభించే 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ కేవలం టూరిజం, సామాజిక కార్యక్రమాల కోసం మాత్రమే. ఈ సదుపాయంతో అక్కడ ఉద్యోగం చేయడానికి అనుమతి ఉండదు. ఉద్యోగం కోసం మలేషియాకు వెళ్లాలంటే ముందుగానే సరైన వర్క్ పర్మిట్ లేదా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు లేకుండా వెళ్లి అక్కడ పని చేయడం చట్టపరంగా సమస్యలకు దారి తీస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

ఉద్యోగం పేరుతో మలేషియా వెళ్లి నిబంధనలు ఉల్లంఘిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చని హైకమిషన్ హెచ్చరించింది. వీసా గడువు దాటిపోవడం, అక్రమంగా దేశంలో ఉన్నట్లు కేసు నమోదు కావడం, మోసపోవడం లేదా వేధింపులకు గురికావడం, అరెస్టు, జైలుకు వెళ్లడం వంటి సమస్యలు రావచ్చని తెలిపింది. మలేషియా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు నిజంగా టూరిజం కోసం మలేషియా వెళ్లే వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని భారత హైకమిషన్ సూచించింది. తిరుగు ప్రయాణ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు వంటి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. అలాగే మలేషియాకు వెళ్లే ముందు Malaysia Digital Arrival Cardను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ప్రయాణానికి కనీసం మూడు రోజుల ముందే MDAC పూర్తి చేయాలని సూచించింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.