
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్న ఒడిశా కూడా అతలాకుతలమవుతోంది. ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు, ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలకు తోడు విరుచుకుపడుతున్న ఈదురు గాలుల తాకిడికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి.
అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ గద్దెరాయి సమీపంలో ఉన్న వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో ప్రయాణాలు స్తంభించిపోయాయి. అటు శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. కాకినాడ జిల్లా కరప మండలం వాకాడ వద్ద కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఒక ఆర్టీసీ బస్సు కూరుకుపోయింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు వాగు రౌద్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నంలోని సింహాచలం మెట్ల మార్గంలో వరద నీరు కొండవాగులా ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెడ్డిగూడెం మండలం చిన్న నందిగామ-పుట్రాల రహదారిపైకి భారీగా వరద చేరుకోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన నున్న సమీపంలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. కారణమిదే!
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి..
నున్న వద్ద పెదవాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది.
కారులో ఉన్న సహకార సంఘం అధ్యక్షుడు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, ఆయన భార్యను… pic.twitter.com/oVt9wOTmtw— Telugu Stride (@TeluguStride) September 24, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక ప్రాంతంలో కొండవాగు ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఓ కారు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే గంటల్లో వర్ష తీవ్రత ఇంకా ఉండే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read : ఏపీ పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్









