Sabarimala : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన బంగారు కిరీటం కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. 2012లో కొందరు భక్తులు ఆలయానికి సమర్పించిన ఈ కిరీటాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్న స్టాక్‌ వెరిఫికేషన్‌లో గుర్తించలేకపోయారు. అసలు కిరీటం స్థానంలో నకిలీ కిరీటం ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అసలు బంగారు కిరీటం బరువు 445.78 గ్రాములు ఉండగా, అందులో 55.72 గ్రాముల బంగారం ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఈ కిరీటాన్ని విలువైన రాళ్లతో అలంకరించారు. అయితే స్టోర్‌రూమ్‌లో ప్రస్తుతం ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉన్నట్లు స్టాక్‌ వెరిఫికేషన్‌లో తేలింది.

Also Read : విడాకులు ఇచ్చినా భార్య ఖర్చులు భర్త చూసుకోవాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

అదే సమయంలో అరన్ములలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు సవర్ల బరువున్న బంగారు గొలుసు కూడా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. శబరిమల స్టోర్‌రూమ్‌, అరన్ముల స్ట్రాంగ్‌ రూమ్‌లలో జరుగుతున్న ఈ స్టాక్‌ వెరిఫికేషన్‌ను హైకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ జస్టిస్‌ కేటీ శంకరన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ బంగారు కిరీటాన్ని తమిళనాడుకు చెందిన కొందరు చార్టర్డ్‌ అకౌంటెంట్లు 2012 ఆగస్టులో శబరిమల ఆలయానికి సమర్పించారు. చింగం 1 సందర్భంగా కిరీటాన్ని అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించారు. ఆ తర్వాత దాన్ని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆలయానికి భక్తులు సమర్పించే విలువైన వస్తువులను ముందుగా ఆలయంలోని రికార్డు పుస్తకంలో నమోదు చేస్తారు. ఆ తర్వాత వాటిని స్టోర్‌రూమ్‌కు తరలిస్తారు. నిబంధనల ప్రకారం ఇలాంటి విలువైన వస్తువులను అనంతరం అరన్ములలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించి భద్రపరచాలి. ఈ ఘటనపై ట్రావన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్‌ స్పందించారు.

బంగారు కిరీటం కనిపించకుండా పోయిందన్న విషయం నిజమైతే ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. ఈ విషయం గురించి తనకు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని చెప్పారు. ఇలాంటి విలువైన వస్తువులను నిబంధనల ప్రకారం అరన్ముల స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచాల్సి ఉంటుందని జయకుమార్‌ తెలిపారు. ఆలయ పరిపాలనలో ఉన్న వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్న ఆందోళన తనకు ఉందని ఆయన చెప్పారు.

Also Read : మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. 9 ముక్కలుగా చేసి బ్యాగుల్లో!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.