
Amit shah : ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన మార్పులకు ఇది పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2026 ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భారత్ ఇప్పుడు 80 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అమిత్ షా చెప్పారు. ఇందులో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయడంతో పాటు, పెట్టుబడులు వచ్చేలా మౌలిక వసతులు, అనుకూల విధానాల విషయంలో యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఝాన్సీ, చిత్రకూట్, ఆగ్రా, అలీగఢ్, కాన్పూర్ సహా డిఫెన్స్ కారిడార్‌లోని ఆరు ప్రాంతాల్లో రక్షణ రంగానికి సంబంధించిన తయారీ యూనిట్లలో పెట్టుబడులు వస్తున్నాయని అమిత్ షా తెలిపారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.78 లక్షల కోట్లను దాటిందని చెప్పారు. 2013-14తో పోలిస్తే రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 56 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.
అమేథీలో తయారవుతున్న ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు కూడా నక్సల్స్, ఉగ్రవాదులపై ప్రభావం చూపుతున్నాయని అమిత్ షా అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న సమయంలో నేరాలు ఎక్కువగా ఉండేవని అమిత్ షా విమర్శించారు. అక్రమ తుపాకుల తయారీ, వాహనాల దొంగతనం, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరిగేవని అన్నారు.
ఇప్పుడు అదే రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్, వాహనాల తయారీ, మెడికల్ డివైస్ పార్క్ వంటి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఒకప్పుడు భయపడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పెట్టుబడులు వచ్చే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మారిందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మార్పు బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వచ్చిందని ఆయన అన్నారు.









