
Taapsee Pannu : బాలీవుడ్లో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను నటి తాప్సీ పంచుకున్నారు. ఎలాంటి కారణం చెప్పకుండానే సినిమాల నుంచి తనను తప్పించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. తాను నటించిన కొన్ని సన్నివేశాలను కూడా అవసరానికి మించి గ్లామరస్‌గా చూపించినట్లు తర్వాత తెలుసుకున్నానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విషయాలను వెల్లడించారు. ఒక సినిమాలో తన డేట్స్ కూడా ఖరారైన తర్వాత చివరి నిమిషంలో తనను తప్పించారని చెప్పారు. ఎందుకు తీసేశారో సరైన కారణం మాత్రం చెప్పలేదన్నారు.
అయితే తనను సినిమా నుంచి తప్పించడానికి చెప్పిన కారణాల్లో ఇదే అత్యంత దారుణమైనదని ఆమె అన్నారు. హీరో భార్యకు నువ్వంటే ఇష్టం లేదు.. అందుకే నిన్ను తీసేశాం అని చెప్పారు. ఆమెకు నేను ఎందుకు నచ్చలేదో నాకు ఇప్పటికీ తెలియదు అని తాప్సీ వెల్లడించారు. అయితే ఆ సినిమా ఏది, హీరో ఎవరు, ఆయన భార్య ఎవరు అనే విషయాలను ఆమె వెల్లడించలేదు.
తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన మరో అనుభవాన్ని కూడా తాప్సీ గుర్తు చేసుకున్నారు. తాను కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్ని సన్నివేశాలను షూట్ చేసే సమయంలో అవి తెరపై మరీ ఎక్కువగా గ్లామర్‌గా, లైంగికంగా కనిపించేలా చిత్రీకరిస్తున్నారని తనకు అర్థం కాలేదని చెప్పారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ సన్నివేశం అలా వెళ్తుందని నాకు తెలియదు. చాలా అందంగా చూపిస్తారని అనుకున్నాను. కానీ సినిమా చూసినప్పుడు అవసరానికి మించి అలా చూపించారని అనిపించింది అని ఆమె అన్నారు.
సినిమా గురించి, నటన గురించి తనకు పెద్దగా అవగాహన లేని సమయంలో చుట్టూ ఉన్నవాళ్లు చెప్పిన మాటలను నమ్మేదానినని తాప్సీ చెప్పారు. అందరూ ఇలాగే చేస్తారు, ఇది సాధారణమే అని చెప్పేవారు. నాకు కూడా ఇదే సినిమా పని అనిపించేది. తర్వాత చూస్తే అలా చూపించడం అవసరం లేదని అర్థమైంది అని తెలిపారు. సినిమాలో గ్లామర్‌గా కనిపించడం, మరీ ఎక్కువగా లైంగికంగా చూపించడం రెండూ ఒకటే కాదని తాప్సీ స్పష్టం చేశారు.









