పశ్చిమాసియా ప్రాంతంలో అణ్వాయుధాల తయారీ పోటీపై మళ్లీ చర్చ స్టార్ట్ అయ్యింది. భవిష్యత్తులో సౌదీ అరేబియా అణ్వాయుధాలు తయారు చేసే దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. సౌదీ అరేబియాకు అణుబాంబులు తయారు చేయాలనే ఆసక్తి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన రహస్య నివేదికను నిఘా వర్గాలు అమెరికా పార్లమెంట్‌కు సమర్పించాయి.

శాంతియుత, పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం సరఫరా చేసేందుకు అమెరికా ప్రభుత్వం ముందడుగు వేసింది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సౌదీ అరేబియాతో 30 సంవత్సరాల సుదీర్ఘకాలిక అణు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికాలోని కొంతమంది చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీకి యురేనియం శుద్ధి చేసే పరిజ్ఞానాన్ని అందిస్తే భవిష్యత్తులో ఆ సాంకేతికతను ఉపయోగించి వారు అణ్వాయుధాలను తయారు చేసుకునే సామర్థ్యాన్ని సంపాదించే ప్రమాదం వారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం కుదిరిన ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా కేవలం 5 శాతం వరకు మాత్రమే యురేనియాన్ని శుద్ధి చేసుకోవడానికి అనుమతి ఉంది. భవిష్యత్తులో ఈ పరిమితిని 20 శాతం వరకు పెంచే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా పౌర అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి తక్కువ స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం సరిపోతుంది. కానీ అణుబాంబులు లేదా అణ్వాయుధాలు తయారు చేయాలంటే యురేనియాన్ని 60 శాతం నుండి 90 శాతం వరకు అత్యంత అధిక స్థాయిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రాథమిక సాంకేతికత చేతికి చిక్కితే భవిష్యత్తులో దానిని మరింత పెంచుకోవడం కష్టం కాదనేది తెలుస్తోంది.

సౌదీ అరేబియా ఈ నిర్ణయం వెనుక ప్రాంతీయ భద్రతా కారణాలు, ప్రత్యర్థి దేశాల బెదిరింపులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో సౌదీకి ప్రధాన ప్రత్యర్థి అయిన ఇరాన్ నిరంతరం అణు కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఒకవేళ ఇరాన్ గనుక అణుబాంబును తయారు చేస్తే, తమ దేశ భద్రతను కాపాడుకోవడం కోసం తాము కూడా తప్పనిసరిగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటామని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలోనే బహిరంగంగా ప్రకటన చేశారు.

ప్రస్తుతం అమెరికా ఇచ్చిన సాంకేతికత, కుదిరిన ఒప్పందం పౌర అవసరాల కోసమే అయినప్పటికీ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా సౌదీ అరేబియా భవిష్యత్తులో సైనిక అవసరాల కోసం అణు సామర్థ్యాన్ని వాడుకునే అవకాశం ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.