ప్రపంచంలోనే అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేం. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తాజా మాట్లాడిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చట్టప్రకారం చైనాకు ఆయుధ ఎగుమతులపై కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందే “మా దగ్గర ఆయుధాలు కొంటారా?” అని ట్రంప్ నేరుగా అడగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ట్రంప్ ఇలా అడగడం వెనుక ఉన్న వ్యూహమేంటని పలువురు అంటున్నారు.

ఈ ఏడాదే అమెరికా, చైనా అధ్యక్షులు రెండుసార్లు భేటీ అయ్యారు. మే నెలలో బీజింగ్‌లో ఒకసారి కలవగా.. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. తైవాన్ వివాదం, ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య పోరు కొలిక్కిరాని ఈ సమయంలో ట్రంప్ తన వ్యాపార చతురతతో చైనాకు ఈ ఆయుధాల ఆఫర్ ఇచ్చారు. నిజానికి చైనాకు ఆయుధాలు అమ్మడం చట్టపరంగా నిషేధం. 1990లో అమెరికా కాంగ్రెస్ చైనాకు రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. దశాబ్దాలుగా ఉన్న ఈ నిషేధాన్ని పక్కన పెట్టి.. మేము ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆయుధాలు అమ్ముతాం.. మీరేమైనా కొంటారా? అని ట్రంప్ అడగడం వెనుక ఒక పెద్ద మైండ్ గేమ్ ఉందనేది తెలుస్తోంది.

Also Read : యూఏఈలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రహస్య పర్యటన.. కారణమిదే!

తైవాన్‌ను తన దేశంలోని అంతర్భాగంగా చైనా భావిస్తుంది. కానీ తైవాన్ స్వీయ రక్షణ కోసం అమెరికా వేల కోట్ల డాలర్ల ఆయుధాలను సరఫరా చేస్తోంది. గత డిసెంబర్‌లోనే ట్రంప్ ప్రభుత్వం తైవాన్ కోసం 11 బిలియన్ల విలువైన రక్షణ ప్యాకేజీని ఆమోదించింది. మరొక 14 బిలియన్ల ఆయుధ ఒప్పందం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. అంటే ఒకవైపు తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనాపై ఒత్తిడి పెంచడం.. మరోవైపు చైనాకే ఆయుధాలు కొంటారా? అని ఆఫర్ ఇవ్వడం ద్వారా షీ జిన్‌పింగ్‌ను ఆందోళనలో పడేసి.. అమెరికాకు అనుకూలమైన ఒప్పందాలు సాధించడమే ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది.

ఒకవేళ ట్రంప్ ఆఫర్ ఇచ్చినప్పటికీ చైనాకు అమెరికా నుంచి సాంప్రదాయ ఆయుధాలు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైనిక నౌకల నిర్మాణ సామర్థ్యంలో చైనా పారిశ్రామిక శక్తి అమెరికా కంటే దాదాపు 230 రెట్లు ఎక్కువగా ఉంది. చిన్న తరహా డ్రోన్ల తయారీలోనూ చైనా ఉత్పత్తి అమెరికా కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. చైనా ఇప్పటికే అత్యధిక రక్షణ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఒకవేళ కొంటే అమెరికా వద్ద ఉన్న అత్యంత రహస్యమైన ఏఐ సాంకేతికత లేదా ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్ జెట్ల వంటి ఆధునిక సాంకేతికతలు మాత్రమే కొంటుంది. కానీ అంత సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా తన ప్రధాన ప్రత్యర్థి దేశానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వదు.

మరోవైపు ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక ప్రతికూలతలు, మందగమనం కూడా ట్రంప్ వ్యాఖ్యలకు బలమైన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడి నెలకొన్న సమయంలో, ఆయుధ ఎగుమతుల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్ల రాబడి తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో ట్రంప్ చైనాతో ఈ డీల్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Also Read : ఏఐ అదుపు తప్పుతోందా? వినియోగదారుల చిత్రాలు లీక్ అయ్యాయా?