US Visa :  అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా అమెరికా విజిటర్ వీసా కోసం ఇంటర్వ్యూ తేదీ రావాలంటే చాలా కాలం వేచి చూడాల్సి వస్తోంది. దాదాపు ఏడాది వరకు వెయిటింగ్ ఉంటోందని అమెరికా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ ఈ నివేదికను విడుదల చేసింది. 2025లో భారత్‌లో అమెరికా విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజులు వేచి చూడాల్సి వచ్చిందని నివేదికలో తెలిపింది. అయితే 346 రోజులు అంటే వీసా రావడానికి పట్టే సమయం కాదు. కేవలం ఇంటర్వ్యూ తేదీ కోసం వేచి ఉండాల్సిన సమయం మాత్రమే. ఇంటర్వ్యూ తర్వాత వీసా రావడానికి ఇంత సమయం పడుతుందని దీని అర్థం కాదు.

2025లో భారత్ నుంచి దాదాపు 14.55 లక్షల మంది అమెరికా నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను చూసేందుకు దేశవ్యాప్తంగా కేవలం 68 మంది అమెరికా అధికారులు ఉన్నారు. అంటే ఒక్కో అధికారిపై వేలాది దరఖాస్తుల భారం ఉంది. దరఖాస్తులు పెరగడం, అధికారులు తక్కువగా ఉండటంతో వీసా ప్రక్రియ ఆలస్యం అవుతోందని నివేదిక తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వెయిటింగ్ ఎక్కువగా ఉంది.

Also Read : మా జోలికి వస్తే ఊరుకోం.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

చైనాలో అమెరికా విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 34 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. బ్రెజిల్‌లో 32 రోజులు ఉంది. మెక్సికోలో 283 రోజుల వెయిటింగ్ ఉంది. ఎక్కువ వెయిటింగ్ ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. కరోనా తర్వాత అమెరికా వీసాల కోసం దరఖాస్తులు ఒక్కసారిగా పెరిగాయి. కానీ దానికి తగ్గట్టుగా సిబ్బంది పెరగలేదు. దీంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయని అధికారులు చెప్పారు.

న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో ఇంటర్వ్యూ కౌంటర్లు కూడా తక్కువగా ఉన్నాయని ఆడిట్‌లో తేలింది. వీసా కోసం వచ్చిన వందలాది మంది ఎంబసీ బయట, వెయిటింగ్ ప్రాంతాల్లో వేచి ఉండటాన్ని అధికారులు గమనించారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్ల విషయంలో కొందరు ఏజెంట్లపై కూడా నివేదికలో ప్రస్తావన వచ్చింది. స్లాట్ ఖాళీ అయిన వెంటనే కొందరు ఏజెంట్లు బుక్ చేసుకుని, వాటిని తమ కస్టమర్లకు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ వీసా అపాయింట్‌మెంట్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసింది. ఇంటర్వ్యూ అవసరం లేని కొన్ని వీసా దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే పరిశీలించి పూర్తి చేసే విధానాన్ని కూడా అధికారులు ఉపయోగిస్తున్నారు.

మరోవైపు H-1B వర్క్ వీసాల విషయంలోనూ అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా ఉద్యోగులను తొలగించిన కంపెనీలు మళ్లీ విదేశీ ఉద్యోగుల కోసం H-1B వీసాలు అడిగితే వాటిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక కంపెనీకి ఉద్యోగులు కావాలని చెబుతూ H-1B వీసాలు అడగడం, అదే సమయంలో వేలాది మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదని ఆయన అన్నారు. అమెరికా ఉద్యోగులను తొలగించిన కంపెనీలు వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను తీసుకునేందుకు H-1B వీసాలను ఉపయోగించకుండా నిబంధనలు కఠినతరం చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వాన్స్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

Also Read : మా జోలికి వస్తే ఊరుకోం.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.