Karan Johar :  బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్‌ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్‌ కరణ్‌ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ 9తో ఈ షోను ముగిస్తున్నట్లు కరణ్ జోహార్‌ ప్రకటించారు. 2004లో మొదలైన ఈ షో ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. సెలబ్రిటీలతో కరణ్ జోహార్ చేసే సరదా మాటలు, వ్యక్తిగత విషయాలు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్‌తో ఈ షో ఎంతో పాపులర్ అయింది. తాజాగా సీజన్ 9కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కరణ్ జోహార్‌ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ షో తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని, ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, సరదా క్షణాలు ఇచ్చిందని చెప్పారు.

చివరి సీజన్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. కొన్ని ప్రయాణాలను మనం ఎప్పటికీ ఆపాలని అనుకోం. కానీ ఒక దశలో వాటిని ముగించాల్సిన సమయం వచ్చిందని మనసుకు అనిపిస్తుంది. కాఫీ విత్ కరణ్ నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఈ షో నాకు ఎన్నో స్నేహాలు, జ్ఞాపకాలు, సరదా క్షణాలు, ఎంతో ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో ఎన్నో వివాదాలను కూడా తెచ్చింది అని చెప్పారు. ఈ ప్రయాణంలో మొదటి నుంచి మాతో ఉన్నది ప్రేక్షకులే. వారు మాతో కలిసి నవ్వారు, మా గురించి మాట్లాడారు, ట్రోల్ చేశారు, అభినందించారు. అన్నింటికంటే ముఖ్యంగా.. మరోసారి కాఫీ తాగేందుకు ఈ షోకి తిరిగి వస్తూనే ఉన్నారు. అందుకే వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడినే. ఈ షోకు వీడ్కోలు చెప్పడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఇదే సరైన సమయం అనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్ ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ చివరి సీజన్ నా చివరి కప్పు కాఫీ లాంటిది. కాబట్టి నాతో కలిసి చివరిసారిగా ఒక కప్పు కాఫీ తాగండి. ఇదే చివరిసారి అని కరణ్ తెలిపారు.

2004లో తన తండ్రితో ఈ షో గురించి చెప్పిన విషయాన్ని కూడా కరణ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడే టాక్ షో చేయాలనుకుంటున్నట్లు తండ్రికి చెప్పానని తెలిపారు. అదే ఏడాది జూన్‌లో తన తండ్రి చనిపోయారని.. ఆ తర్వాత ఆగస్టు 16న మొదటిసారి ఈ షో షూటింగ్ చేశానని చెప్పారు. ఇప్పటివరకు 8 సీజన్లు, 161 ఎపిసోడ్లు పూర్తి చేసిన ఈ షోతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని కరణ్ తెలిపారు. ఈ షో వల్ల ప్రేమ జంటలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తనతో మాట్లాడారని చెప్పారు.

ఇక సీజన్ 9 తనకు చివరిదని కరణ్ స్పష్టం చేశారు. అభిమానులు ప్రతి చోటా తర్వాత సీజన్ ఎప్పుడు? అని అడుగుతుంటారని.. ఈసారి మాత్రం చివరిసారి కాఫీ కప్పు ఎత్తబోతున్నానని భావోద్వేగంగా చెప్పారు. కాఫీ విత్‌ కరణ్‌ సీజన్ 9 అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్‌లో ఎవరెవరు సెలబ్రిటీలు పాల్గొంటారనే దానిపై ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. అహాన్ పాండే-అనీత్ పడి మొదలుకొని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వరకు ఈ షోకు అతిథులుగా వస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే అధికారిక గెస్ట్ లిస్ట్‌ను షో ప్రారంభమైనప్పుడు వెల్లడించనున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.