Fake Notes :  గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ కూరగాయల వ్యాపారి నకిలీ నోట్లు తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చూసిన తర్వాత నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి నుంచి దీనిపై శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. రాజ్‌కోట్ సిటీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కలిసి ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు నకిలీ నోట్లు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.65,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన వ్యక్తిని కిషన్ సోలంకిగా గుర్తించారు. రాజ్‌కోట్‌లోని మందదుంగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అతను నకిలీ రూ.100, రూ.500 నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కిషన్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు 216 నకిలీ రూ.100 నోట్లు, మూడు నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఓ CPU, మానిటర్, రెండు ప్రింటర్లు, లామినేటర్ హీటర్ మెషీన్, బటర్ పేపర్, రూ.100 నోట్ల డిజైన్‌ ముద్రించిన పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read : రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా!

కిషన్ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు. తక్కువ ఆదాయం కారణంగా అప్పులు పెరిగిపోయాయని విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుండగా నకిలీ రూ.100, రూ.500 నోట్లు ఎలా తయారు చేయాలో చూపించే ఓ రీల్ అతని కంటపడింది. ఆ రీల్ వెనుక ఉన్న వ్యక్తిని కిషన్ సంప్రదించాడు. ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. టెలిగ్రామ్‌లో జరిగిన సంభాషణల ద్వారా నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో కిషన్ నేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు శిక్షణ ఇచ్చిన వ్యక్తికి నకిలీ నోట్ల రూపంలో రూ.10 వేలు ఇచ్చినట్లు కిషన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దానికి బదులుగా ఆ వ్యక్తి కిషన్‌కు రూ.3 వేలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు కిషన్‌కు శిక్షణ ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కిషన్ నకిలీ నోట్లను ఒకేసారి పెద్ద మొత్తంలో ఎక్కడికీ అమ్మలేదని పోలీసుల విచారణలో తేలింది. అతనే వాటిని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న కొనుగోళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగు నుంచి ఐదు నెలల్లో సుమారు 40 నకిలీ రూ.100 నోట్లను చలామణిలోకి తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన జన్మాష్టమి జాతరను కూడా నకిలీ నోట్లు చలామణి చేయడానికి ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న మొత్తాల కొనుగోళ్లలో రూ.100 నోట్లను ఇస్తే వ్యాపారులు పెద్దగా అనుమానించరని భావించి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేసే పరికరాలు దొరకడంతో.. కిషన్ ఇప్పటివరకు ఎన్ని నోట్లు తయారు చేశాడు? ఎక్కడెక్కడ వాటిని ఉపయోగించాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : హోటళ్లు, రెస్టారెంట్లకు బిగ్ షాక్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.