
Neerja Bhanot : వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకుంది అంటే ఎలా ఉంటుంది. చాలా మంది ఇక తమ పని అయిపోయింది అనుకుంటారు. ఆ క్షణంలో కొందరు తమ ప్రాణాల కంటే ఇతరుల ప్రాణాలకే ఎక్కువ విలువ ఇస్తారు. అలాంటి వారే నిజమైన హీరోలు అవుతారు. ఇప్పుడు ప్రపంచమంతా స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుకుంటుంది. ఫ్లైదుబాయ్‌లో జరిగిన పోరాటంలో తాను గాయపడినా.. ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగాడు. సరిగ్గా.. 1986లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో ఓ మహిళ తన ప్రాణాలనే కోల్పోయింది. ఇంతకు ఆమె ఎవరంటే నీర్జా భనోట్.
చండీగఢ్‌కు చెందిన నీర్జా భనోట్… అమెరికాకు చెందిన పాన్ ఆమ్ ఎయిర్‌లైన్స్ లో డ్యూటీ చేసింది. అయితే1986 సెప్టెంబర్ 5న ఫ్లైట్ 73 ముంబయి నుంచి న్యూయార్క్ బయల్దేరింది. మధ్యలో పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లోఆగింది. తర్వాత విమానం టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి టైమ్ లో నీర్జా భనోట్ కూడా ఉగ్రవాదులు ఏం చెబితే అదే చేయాల్సింది. కానీ ఆమె అలా అనుకోలేదు..తన కంటే ప్రయాణికుల ప్రాణాలే ఎక్కువ అని అనుకుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న నీర్జా భనోట్ వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించింది.
Also Read : ఏంటి నిజమా? బ్యాంకులకు ప్రతి శనివారం సెలవా?.. నిజమెంత?
కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోకుండా పైలట్లు అడ్డుకోగలిగారు. ఆ తర్వాత ఉగ్రవాదుల అసలు లక్ష్యం బయటపడింది. విమానంలో ఉన్న అమెరికా ప్రయాణికులను బందీలుగా చేసుకుని.. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ వేశారు అందుకే విమానంలోని ప్రయాణికులందరి పాస్‌పోర్టులు తీసుకురావాలని నీర్జాతో పాటు ఇతర సిబ్బందిని బెదిరించారు. అయితే నీర్జా మాత్రం ఉగ్రవాదులకు సహకరించలేదు. అమెరికా ప్రయాణికులను గుర్తించేందుకు వీలు లేకుండా వారి పాస్‌పోర్టులను దాచిపెట్టారు. దీంతో ఉగ్రవాదుల ప్లాన్‌కు ఆమె గట్టి అడ్డుకట్ట వేశారు.
దాదాపు 17 గంటల పాటు విమానం ఉగ్రవాదుల ఆధీనంలోనే ఉంది. ప్రయాణికులను సురక్షితంగా విడిపించేందుకు అధికారులు ఉగ్రవాదులతో చర్చలు జరిపినా.. అవి ఫలించలేదు. ఇంతలో విమానంలోని ఇంధనం పూర్తయింది. లైట్లు కూడా ఆగిపోయాయి. ఇదే సరైన సమయమని భావించిన నీర్జా.. ప్రయాణికులను బయటకు పంపించేందుకు రంగంలోకి దిగింది. ఎవరూ గుర్తించకుండా నెమ్మదిగా మూడు అత్యవసర ద్వారాలను తెరిచి.. ఒక్కొక్కరిగా ప్రయాణికులను విమానం నుంచి బయటకు పంపించడం మొదలుపెట్టారు. ప్రయాణికులు బయటకు వెళ్తున్న విషయం ఉగ్రవాదులు గుర్తించడంతో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో కొంతమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా నీర్జా వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం కొనసాగించారు. ముగ్గురు చిన్నారులు కాల్పులకు గురికాకుండా ఉండేందుకు నీర్జా వారికి కవచంలా నిలిచారు. ఆ పిల్లలను బయటకు పంపించే ప్రయత్నంలోనే ఉగ్రవాదుల తూటాలకు ఆమె బలయ్యారు.
1963 సెప్టెంబర్ 7న చండీగఢ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో నీర్జా భనోట్ జన్మించారు. ఆమె తండ్రి హరీశ్ భనోట్ జర్నలిస్టుగా పనిచేశారు. మొదట మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని అనుకున్న నీర్జా.. ఆ తర్వాత విమానయాన రంగంలో అడుగుపెట్టారు. అయితే తన 23వ పుట్టినరోజుకు కేవలం రెండు రోజుల ముందు జరిగిన హైజాక్ ఘటనలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరంగా మారింది. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన సాహసానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం నీర్జాకు మరణానంతరం అశోక చక్ర పురస్కారం అందించింది. అత్యంత చిన్న వయసులో ఈ పురస్కారం అందుకున్న మహిళగా నీర్జా నిలిచారు. నీర్జా జీవితం, ఆమె చేసిన త్యాగం ఆధారంగా 2016లో బాలీవుడ్లో నీర్జా పేరుతో సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రముఖ నటి సోనమ్ కపూర్ నీర్జా పాత్రలో నటించారు.
Also Read : హోటళ్లు, రెస్టారెంట్లకు బిగ్ షాక్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు!









