
Sri Lanka : శ్రీలంకలో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో 8 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబో సమీపంలోని తలవతుగోడలోని ఓ ఇంటి నుంచి ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తలంగమా పోలీసులు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌తో పాటు ఇతర ప్రత్యేక విభాగాల సాయంతో ఈ దాడి చేశారు. అందిన సమాచారంతో పోలీసులు ముందుగా కడువెలా మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత అనుమానితులు ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు.
అరెస్ట్ చేసిన 8 మంది వయసు 22 నుంచి 51 ఏళ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా భారతీయులేనని వెల్లడించారు.సోదాల్లో 6 కంప్యూటర్లు, 39 మొబైల్ ఫోన్లు, పెద్ద మొత్తంలో కంప్యూటర్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేందుకు ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ వ్యవహారం ఎంత పెద్దది? ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో విదేశీయులు నిర్వహిస్తున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అధికారులు ఇటీవల దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు తెలిపారు.









