
Priyanka Gandhi : ఢిల్లీలోని జన్‌పథ్‌లో బుధవారం ఇండియా కూటమి ఎంపీల నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ఓట్ చోరీ అంశంపై నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్‌కు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు భారీ భద్రతా వలయంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర మహిళా ఎంపీలు జంతర్ మంతర్‌కు వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
Also Read : కోహ్లీ-రోహిత్ వీపుపై ఆ డివైజ్ ఏంటి? అసలు సీక్రెట్ ఇదే!
తనను అదుపులోకి తీసుకునే సమయంలో మహిళా పోలీసులు కిందకు తోసేశారని, తన శరీరమంతా గీరారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌ను కలవాలని అడిగిన ఎంపీలతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎంపీలను కొడుతున్నారని, కిందకు తోసేశారని ఆరోపించారు. తాము అక్కడి నుంచి కదిలేది లేదని, పోలీసులు తమ బలగాలను వెనక్కి తీసుకునే వరకు అక్కడే ఉంటామని చెప్పారు. జన్‌పథ్ నుంచి జంతర్ మంతర్ వైపు ప్రతిపక్ష ఎంపీలను తీసుకెళ్తున్న బస్సులను అశోకా రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. దీంతో రోడ్డుపై బస్సులు నిలిచిపోయాయి. నేతలు నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆయనను భుజాలపై ఎత్తుకుని పోలీస్ మినీబస్సులోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ఉదయ్ భాను చిబ్ తదితరులు రాహుల్ ఉన్న బస్సుపైకి ఎక్కగా.. మరో నేత ముంతాజ్ పటేల్ బస్సు బానెట్‌పై కూర్చున్నారు.
ఆ తర్వాత పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై పడుకుని నిరసన చేస్తున్న ప్రియాంక గాంధీతో పాటు ఇతర మహిళా నేతలను అక్కడి నుంచి తొలగించారు. వారిని కూడా బస్సుల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.ఓట్ చోరీ అంశంపై నిరసన చేపట్టడంతో పాటు జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు ఈ ఆందోళన చేపట్టారు. ఒక రోజు ముందు కూడా ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష ఎంపీలు సుమారు తొమ్మిది గంటల పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జంతర్ మంతర్ అధికారికంగా నిరసనలు చేసేందుకు కేటాయించిన ప్రాంతమని, అక్కడే తాము నిరసన చేస్తామని చెప్పారు. జ్ఞానేశ్ కుమార్ తమ దృష్టిలో చట్టబద్ధమైన ఎన్నికల కమిషనర్ కాదని దేశానికి చెబుతామని అన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్ తదితర పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు మాత్రం ఈ ఆందోళనకు హాజరు కాలేదు.
Also Read : IAFకు కొత్త బాస్..ఆశుతోష్ దీక్షిత్‌కు కీలక బాధ్యతలు!









