Chennai :  చెన్నైలో గురువారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. తిరువాన్మియూర్ రోడ్డులోని టైడల్ పార్క్ సమీపంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ భారీ గుంత ఏర్పడగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు అందులో పడిపోయింది. సుమారు 10 అడుగుల లోతు ఉన్న గుంతలో కారు బోల్తా పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డు పెద్ద భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో కారు పూర్తిగా గుంతలోకి వెళ్లిపోయింది.

కారు గుంతలో పడిన సమయంలో అందులో ఓ మహిళ, ఓ వ్యక్తి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో కారులో ఉన్న డ్రైవర్‌కు స్పందించేందుకు పెద్దగా సమయం లేకపోయిందని తెలుస్తోంది. కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

Also Read : ఐఫోన్ కొట్టేసిన దొంగకు పాస్‌కోడ్ కష్టాలు.. చివరికి యజమానికే మెసేజ్!

ప్రస్తుతం ఈ ప్రాంతంలో మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం కలకలం రేపింది. ప్రమాదంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరువాన్మియూర్ జంక్షన్ సమీపంలో గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. 2025 మేలో ఓ పాత మురుగు నీటి పైప్‌లైన్ పాడవడంతో రోడ్డు కూలిపోయింది. ఆ సమయంలో ఓ కారు సుమారు ఆరు అడుగుల లోతున్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.

ప్రస్తుతం రోడ్డు కుంగిపోయిన ప్రాంతంలో మెట్రో సిబ్బంది మరమ్మతు పనులు మొదలుపెట్టారు. రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన మార్గంలో ట్రాఫిక్ రాకపోకలకు ఇంకా అంతరాయం కొనసాగుతోంది.

Also Read : ఇక బట్టలు ఉతకడం చాలా కాస్ట్లీ గురూ.. భారీగా పెరిగిన వాషింగ్ పౌడర్ ధరలు..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.