China : చైనాలో ఓ రెస్టారెంట్ యజమాని తన ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాగా పనిచేసిన కొందరు ఉద్యోగులకు ఏకంగా కొత్త BMW కార్లను గిప్ట్ గా ఇచ్చారు. చలి, వర్షం, గాలిలో రోజూ స్కూటర్లపై ఉద్యోగానికి వచ్చే సిబ్బందిని చూసి.. వారికి ఈ కష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కార్లు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువోలో మా యాన్‌లీ అనే మహిళ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్ నడుపుతున్నారు. ఆమె దగ్గర పనిచేసే చాలామంది ఉద్యోగులు ఎలక్ట్రిక్ స్కూటర్లపై రోజూ ఆఫీసుకు వస్తుంటారు. చలి, వర్షం, బలమైన గాలులు ఉన్నప్పుడు కూడా వారు స్కూటర్లపైనే ప్రయాణించడాన్ని ఆమె గమనించారు.

తాను మాత్రం సౌకర్యంగా ప్రయాణిస్తుంటే.. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు మాత్రం ఇలాంటి వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నారని ఆమె భావించారు. దీంతో బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 24న కొంతమంది ఉద్యోగులను BMW షోరూమ్‌కు తీసుకెళ్లారు. అయితే వారికి తాము ఓ మీటింగ్‌కు వెళ్తున్నామని చెప్పారు. షోరూమ్‌కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు కొత్త BMW కార్లు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Also Read : H-1B వీసాదారులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఒక్కో BMW కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు. మన కరెన్సీలో దాదాపు రూ.43 లక్షలు. ఈ కార్లను ఉద్యోగులకు ఇచ్చే రెండు వారాల ముందే మా యాన్‌లీ పూర్తిగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో కార్లు అందుకున్న ఉద్యోగులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కారు అందుకున్న ఉద్యోగుల్లో లీ జీ అనే ఉద్యోగి తన ఆనందాన్ని పంచుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గిఫ్ట్ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. BMW షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్ మా నాకు ఓ పెద్ద బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తానని మాత్రమే చెప్పారని తెలిపారు.

ఓ ఉద్యోగి చలిలో ప్రయాణించి తిరిగి వచ్చినప్పుడు అతడి ముఖం ఎర్రగా మారడాన్ని చూసిన తర్వాత మా యాన్‌లీ మరింతగా ఆలోచించినట్లు చెప్పారు. తాను సౌకర్యంగా ప్రయాణించగలిగినప్పుడు తన ఉద్యోగులు మాత్రం ఇలాంటి కష్టాలు ఎందుకు పడాలని ఆమె ప్రశ్నించుకున్నారు. తన వ్యాపారం ఇంతగా ఎదగడానికి ఉద్యోగులందరి కష్టమే కారణమని మా యాన్‌లీ చెప్పారు. అందుకే కంపెనీ విజయంతో వచ్చిన ప్రయోజనాల్లో ఉద్యోగులు కూడా నేరుగా భాగం కావాలని ఆమె భావించినట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇలా ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బాస్ అంటే ఇలా కదా ఉండాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం.. 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు ధ్వంసం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.